యుద్ధంతో సమస్యలు పరిష్కారం కావు.. ఆస్ట్రియాలో భారత ప్రధాని మోదీ | PM modi Austrian Chancellor talks on Ukraine war Middle East conflict feature | Sakshi
Sakshi News home page

యుద్ధంతో సమస్యలు పరిష్కారం కావు.. ఆస్ట్రియాలో భారత ప్రధాని మోదీ

Published Wed, Jul 10 2024 3:57 PM | Last Updated on Wed, Jul 10 2024 4:21 PM

PM modi Austrian Chancellor talks on Ukraine war Middle East conflict feature

వియన్నా: మూడోసారి భారత్ ప్రధానిగా ఎన్నిక అయ్యాక  ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని మోదీ ఆస్ట్రియా  పర్యటన బుధవారం కొనసాగుతోంది. ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ ఉన్నతస్థాయి సమావేశం అయ్యారు. అనంతరం ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 

ప్రధాని నరేం‍ద్ర మోదీ మాట్లాడారు. ‘ఇది యుద్ధం చేసే సమయం కాదు.  ఇదే విషయాన్ని నేను గతంలో  చెప్పాను. యుద్దంతో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేం. ప్రపంచంలో ఎక్కడైనా   అమాయక ప్రజలను బలితీసుకోవటం ఆమోదించదగ్గ విషయం కాదు. భారత్‌, ఆస్ట్రియా కలిసి దౌత్యపరంగా సహకారం అందిస్తాం. 

.. నేను  మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యాక ఇక్కడికి వచ్చే అవకాశం రావటం చాలా ఆనందంగా ఉంది.  41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా పర్యటించటం చాలా ప్రత్యేకంతో పాటు చారిత్రాత్మకమైంది. ఇవాళ  ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో సానుకూలమైన చర్చలు జరిగాయి. ఇరుదేశాల మధ్య భవిష్యత్తులో చేసుకొనే పలు ఒ‍ప్పందాల వృద్దిపై చర్చించాం. అందులో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్‌, వాటర్‌, వ్యర్థాల నిర్వహణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాల్లో అభివృద్ధి కోసం ఒప్పందాలపై చర్చలు జరిపాం’ అని ప్రధాని మోదీ తెలిపారు.

 

అంతకుముందు.. ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ మాట్లాడారు. ‘‘నిన్న రాత్రి,  ఇవాళ ఉదయం భారత  ప్రధాని మోదీతో  ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాక్రమణపై  చాలా విషయాలు చర్చించుకున్నాం. యూరోపియన్‌  దేశాల ఆందోళన భారత్‌ తెలుసుకోవటం, సాయం అందించటం చాలా ముఖ్యమైన అంశం.  అదే విధంగా మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణలు చాలా  ప్రధానమైనవి.  భౌగోళికంగా సవాలు విసురుతున్న ఈ ఘర్షణ పరిస్థితులపై సహకారంపై చర్చలు జరిపాం. 1950 నుంచి ఇండియా , ఆస్ట్రియా దేశాల మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ స్నేహం నమ్మకంతో ముందుకుసాగుతోంది. 1955లో ఇండియా ఆస్ట్రియాకు సాయం చేసింది. అప్పటి నుంచి భౌగోళిక రాజకీయ పరిస్థితుల అభివృద్ధిపై ఇరు దేశాలను ఏకం చేస్తోంది’’ అని పేర్కొన్నారు.

దీని కంటేముందు ప్రధాని మోదీకి ఆస్ట్రియాలో ఘనస్వాగతం లభించింది. రెండ్రోరోజుల రష్యా పర్యటన అనంతరం మోదీ బుధవారం ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో రిట్జ్ కార్ల్టన్ హోటల్‌లో భారతీయులు, ఆస్ట్రియన్స్‌ కళాకారులు వందేమాతరం గీతంతో  మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement