
‘డార్క్ ప్యాటర్న్’లతో కస్టమర్లకు సినిమా
సబ్‌స్క్రిప్షన్ రద్దు అంత సులభం కాదు పారదర్శకత లేని క్యాన్సిలేషన్ విధానం
లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది ఇదే
అభిమాన తారలు నటించిన సినిమా ఎప్పుడు రిలీజవుతుందా.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే వీక్షకులు కోట్లలో ఉంటారు. ఓటీటీలోకి వస్తోందని, ఫలానా తేదీన స్ట్రీమింగ్ అవుతుందని తెలియగానే ఆరోజు కోసం ఎదురు చూసేవారెందెరో. ఆ సినిమా కోసమైనా ఓటీటీ యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునేవారూ ఉన్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ను రద్దు చేయాలంటే? సైన్ అప్ చేసినంత సులభం కాదని ఇటీవలి సర్వే వెల్లడించింది. అంతేకాదు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటోందట.
సినిమాలూ, వెబ్ సిరీస్‌ల వంటివి చూపే ఓవర్ ద టాప్ (ఓటీటీ) యాప్‌లలో సబ్‌స్క్రిప్షన్ ను (చందా) రద్దు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వేలో తేలింది. దేశంలోని డిజిటల్ వినియోగదారులలో డిజిటల్ సేవల సబ్‌స్క్రిప్షన్స్ ను రద్దు చేయడంలో సగం మంది తరచూ ఇబ్బంది పడుతున్నారట. చాలా సందర్భాల్లో రద్దు చేసే ఆప్షన్ అందుబాటులో ఉండడం లేదని సర్వేలో పాలుపంచుకున్నవారు తెలిపారు. యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆ ఆప్షన్ ఎక్కడో ఉండటం వల్ల దాన్ని కనుక్కోలేకపోయామని వినియోగదారులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా 353 జిల్లాల్లోని 95,000కుపైగా మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా లోకల్‌సర్కిల్స్ ఈ నివేదిక రూపొందించింది. చందా రద్దు ప్రక్రియ కష్టతరం చేయడానికి ప్లాట్‌ఫారాలు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఈ నివేదిక బహిర్గతం చేసింది. ‘డార్క్ ప్యాటర్న్స్’ అని పిలిచే ఈ ఉపాయాలు ఇప్పుడు వినియోగదారులు, నియంత్రణ సంస్థల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నాయని ఈ నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం 69 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తి లేకపోయినా..
ఈ నివేదిక ద్వారా గుర్తించిన అత్యంత సాధారణ డార్క్ ప్యాటర్న్‌లలో సబ్‌స్క్రిప్షన్ ట్రాప్ ఒకటి. ఓటీటీలో సైన్ అప్ చేసే సమయంలోనే కంపెనీలు తమ ఉపాయాలను ప్రదర్శిస్తున్నాయి. ఫ్రీ ట్రయల్స్ ఆఫర్ చేసినా.. కాల పరిమితి ముగియగానే సులభంగా నిష్క్రమించే అవకాశం లేకుండా పోతోంది. అన్ సబ్‌స్క్రయిబ్ చేసే ఆప్షన్ గుర్తించడం కష్టంగా ఉంటోంది. దీంతో వినియోగదారులు వారు అనుకున్న దానికంటే ఎక్కువ కాలం సభ్యత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తింది.
బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ ఉండడంతో కాల పరిమితి కాగానే ఖాతాలోంచి డబ్బులు కట్ అయిపోయి, సబ్‌స్క్రిప్షన్ రీచార్జ్ అయినట్టుగా చాలా మంది తెలిపారు. కొన్ని సందర్భాల్లో అదనపు యాప్‌లను ఇన్ స్టాల్ చేయడం, లేదా అవసరమైన దానికంటే ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని కూడా పంచుకోవాల్సి వస్తోంది. ఓటీటీ సేవలకు అవసరం లేని చర్యలను వినియోగదారులు పూర్తి చేయాల్సి ఉంటోంది. ముఖ్యం కాకపోయినా సబ్‌స్క్రిప్షన్ సమయంలో ఈ దశలను కంపెనీలు తప్పనిసరి అని చెప్పి పూర్తి చేయిస్తున్నాయి.
లోపించిన పారదర్శకత..
సబ్‌స్క్రిప్షన్ సమయంలో కంపెనీలు ఒక ధరను ముందుగా ప్రదర్శిస్తున్నాయి. చెక్ అవుట్ ప్రక్రియ సమయంలో తప్పనిసరి రుసుములు, ఛార్జీలను జోడిస్తున్నాయి. ఈ తరహా మోసానికి గురైనట్టు చందాదారులు చెబుతున్నారు. ఓటీటీ సేవలకు సబ్‌స్క్రైబ్ చేసుకునేటప్పుడు అదనపు ఛార్జీల గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని 53% మంది వినియోగదారులు వెల్లడించారు. చెల్లింపు చివరి దశలో మాత్రమే ఈ అదనపు ఖర్చులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కంపెనీల్లో పారదర్శకత లోపించిందనడానికి ఇది నిదర్శనమని నివేదిక వివరించింది.
దృష్టి మరల్చడానికి..
వినియోగదారుల దృష్టి మరల్చడానికి లేదా తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించిన గమ్మతై ్తన నేవిగేషన్, రంగు రంగుల సంకేతాలతో కూడిన ఇంటర్‌ఫేస్‌లను కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. ఆఫర్స్‌ను తిరస్కరించడం, ట్రయల్స్‌ను నిలిపివేయడం, చందా రద్దు (క్యాన్సిలేషన్) మార్గాన్ని కనుగొనడం కష్టతరం అయ్యే పరిస్థితులను ఎదుర్కొన్నామని 86% మంది వినియోగదారులు చెప్పారు. ‘కంపెనీలు ఒక ఆఫర్ లేదా సేవను ప్రమోట్ చేస్తున్నాయి. సైన్ అప్ చేసిన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రకటనలు లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్నీ చూడండని ఊదరగొట్టి ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. అదనంగా చెల్లించకపోతే ప్రకటనలను కొనసాగిస్తున్నాయి’ అని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు.
రద్దు చేసినా చార్జీలు..
సబ్‌స్క్రిప్షన్ ను రద్దు చేసిన తర్వాత కూడా కంపెనీలు ఛార్జ్ చేస్తున్నాయని వినియోగదారులు అంటున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 24% మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఎలాంటి అలర్ట్, వివరణ లేకుండానే ఈ ప్రక్రియ జరుగుతోందని వారు అంటున్నారు. సబ్‌స్క్రిప్షన్ గడువు అయిపోయిందని, ఇక డబ్బు చెల్లించనక్కర్లేదని భావించినప్పటికీ బ్యాంకు ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతోందని వారు చెబుతున్నారు.
కంపెనీల ఈ డిజైన్ వ్యూహాలు స్వల్పకాలంలో ప్లాట్‌ఫామ్‌లకు ప్రయోజనం చేకూర్చినప్పటికీ వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతాయని లోకల్‌సర్కిల్స్ స్పష్టం చేసింది. సౌలభ్యం తగ్గిందని, ప్రకటనలు ఎక్కువయ్యాయని, గందరగోళమైన బిల్లింగ్ ఉంటోందన్నది కస్టమర్ల వాదన. సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేటప్పుడు కంపెనీల నుంచి సహాయం, స్పష్టత పొందలేకపోయామని వినియోగదారులు తెలిపారు.
అయినా మారలేదు..
ఈ సమస్యలను పరిష్కరించడానికి 2023లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ 13 రకాల డార్క్ ప్యాటర్న్స్ నివారణ, నియంత్రణ కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు డిజిటల్ పారదర్శకతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అవి ఈ–కామర్స్ సేవలకు మాత్రమే వర్తిస్తాయని వాదిస్తున్నాయి.
అయితే కంపెనీల మోసపూరిత విధానాలపై కన్నెర్ర చేసిన సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 2023 నవంబర్‌లో ఓ హెచ్చరిక జారీ చేసింది. తప్పుదోవ పట్టించే ఇంటర్‌ఫేస్‌లను తొలగించడానికి కంపెనీలకు మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ తరవాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదని లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. భారత్‌లో వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో స్పష్టమైన నియమాలు, బలమైన అమలు వ్యవస్థ ఉండాలని ఈ నివేదిక అభిప్రాయపడింది.