
వాతావరణ మార్పులు, మంచు కరగడమే కారణం
భూభ్రమణ వేగం వల్ల ‘24 గంటల్లో’ స్వల్ప తగ్గుదల
కంప్యూటర్లు, శాటిలైట్ల వంటి వ్యవస్థలపై ప్రభావం
ఈ మధ్య భూమి వేగంగా తిరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూభ్రమణం వల్లనే పగలు, రాత్రి ఏర్పడతాయి. అంటే వేగం ప్రభావం కాలం మీదా పడుతుంది. టైమ్ ఆధారంగా పనిచేసే కంప్యూటర్లు, జీపీఎస్ శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, స్టాక్ మార్కెట్ల వంటి ఆర్థిక వ్యవస్థలు.. అన్నీ ప్రభావితమవుతాయి. అంటే.. సుదీర్ఘకాలంలో మానవాళికి ఓ అకాల సమస్య సవాలు విసరనుందా?
ఈ ఏడాది వేసవిలో భూమి చాలా వేగంగా తిరిగింది. ఫలితంగా రోజు వేగంగా గడిచిపోతోంది. జూలై 10.. ఈ ఏడాదిలో అత్యంత పొట్టి రోజు. రోజుకు ఉండాల్సినవి 24 గంటలు. కానీ ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్, యూఎస్ నేవల్ అబ్జర్వేటరీల వంటి వాటి ప్రకారం ఆ రోజున 1.36 మిల్లీ సెకన్లు (0.00136 సెకన్లు) తక్కువయ్యాయి. జూలై 22, ఆగస్టు 5న కూడా ఇలాంటి పొట్టి రోజులే నమోదు కానున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరుసగా 1.34, 1.25 మిల్లీ సెకన్లు ఈ రెండు రోజుల్లో లోటు పడతాయట.
86,400 సెకన్లకు అటూ ఇటుగా..
భూమి తనచుట్టూ తాను తిరగడానికి 24 గంటలు లేదా 86,400 సెకన్ల సమయం పడుతుందని మనం చదువుకున్నాం. కానీ, చంద్రుడి గురుత్వాకర్షణ, భూ కేంద్రంలో మార్పుల ప్రభావం.. వీటన్నింటివల్ల కచ్చితంగా 86,400 సెకన్లు ఉండదు. కాస్త అటూ ఇటుగా ఉంటుంది. స్వల్పకాలంలో దీని ప్రభావం మనపై పెద్దగా కనిపించదు కాబట్టి మనకు తెలియదు.
అణు గడియారాలు
సమయాన్ని అత్యంత కచ్చితంగా కొలిచేందుకు రూపొందించినవే అణుగడియారాలు. ప్రతి అణువుకు ఒక నిర్దిష్ట పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) ఉంటుంది. ఈ పౌనఃపున్యం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అణు గడియారాలు ఈ పౌనఃపున్యాన్ని ఉపయోగించి సమయాన్ని కొలుస్తాయి. ఈ సమయాన్నే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (యూటీసీ) అని పిలుస్తారు. ఇది దాదాపు 450 అణు గడియారాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సమయపాలనకు ప్రపంచ ప్రమాణం, అలాగే మన ఫోన్ లు, కంప్యూటర్‌లు అన్నింటిలోనూ పొందుపరిచిన సమయం కూడా ఇదే.
1972 నుంచి..
1972 నుంచి భూమి భ్రమణ వేగం బాగా తగ్గింది. అణు గడియారాలతో పోలిస్తే.. ఈ సమయం తక్కువ కావడంతో యూటీసీకి ‘లీప్ సెకన్’ను జోడించాలని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ ఆదేశించింది. దీన్ని పాజిటివ్ లీప్ సెకన్ అని పిలుస్తారు. చెప్పాలంటే ఇది లీప్ ఇయర్ లాంటిది. 1972 జూన్ 30 నుంచి మొత్తం ఇలా 27 లీప్ సెకన్లను యూటీసీకి అదనంగా జోడించారు. కానీ, 2016 డిసెంబర్ 31 తరవాత మాత్రం ఒక్కటి కూడా అదనంగా చేరలేదు.
ఎందుకు ఈ వేగం?
డంకన్ ఆగ్నూ అగ్నూ అంచనాల ప్రకారం.. చంద్రుడు, సముద్ర అలల కారణంగా భూభ్రమణంలో అత్యంత స్వల్ప కాల మార్పులు సంభవిస్తున్నాయి. చంద్రుడు భూమధ్యరేఖకు పైన ఉంటే భూమి నెమ్మదిగా తిరుగుతోంది. వేసవిలో భూమి కాస్త వేగంగా తిరుగుతుంది.
వాతావరణ మార్పులు కూడా లీప్ సెకన్‌కు కారణమవుతున్నాయి. గత ఏడాది ‘నేచర్’జర్నల్‌లో ప్రచురితమైన ఆగ్నూ అధ్యయనం ప్రకారం.. అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌లలోని మంచు కరిగి సముద్రాల్లోకి కలిసి, సముద్ర మట్టాలు పెరిగి భూభ్రమణ వేగం తగ్గుతోంది. మంచు కరగడం భూమి అక్షంలో కూడా మార్పులకు కారణమవుతోందని స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ బెనెడిక్ట్ సోజా పరిశోధనలో తేలింది. ‘సాధారణంగా చంద్రుడు భూభ్రమణాన్ని ఇంతవరకు ప్రభావితం చేస్తున్నాడు. కానీ, ఈ శతాబ్దం చివరి నాటికి.. భూమిపై గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు భారీగా పెరిగి అవి భూభ్రమణ వేగాన్ని ప్రభావితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటున్నారు సోజా.
లీప్ సెకన్
కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ – యూటీసీ నుంచి ఒక సెకను తీసేస్తే నెగటివ్ లీప్ సెకండ్ అంటారు. పాజిటివ్ లీప్ సెకన్ అంటే యూటీసీకి ఒక సెకన్‌ను జోడిస్తారు. భూభ్రమణ వేగం పెరిగినప్పుడు నెగటివ్ లీప్ సెకన్ అవసరమవుతుంది. దీనివల్ల ఒక రోజు 86,400 సెకన్ల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.
సాధారణంగా సమయాన్ని గంటలు, నిమిషాలు, సెకన్లలో చెప్తాం. ఉదాహరణకు.. 23:59:59 తరవాత.. 00:00:00 వస్తుంది. కానీ పాజిటివ్ లీప్ సెకన్ ఉంటే..
23:59:59, 23:59:60 తరవాత 00:00:00 వస్తుంది. అదే నెగటివ్ లీప్ సెకన్ అయితే... 23:59:57, 23:59:58 తరవాత 00:00:00 వస్తుంది.
1949లో మొట్టమొదటి అణు గడియారం తయారైనప్పటి నుంచి చూస్తే 2024 జూలై 5ను శాస్త్రవేత్తలు అతి పొట్టి రోజుగా గుర్తించారు. ఈ రోజున 24 గంటల కంటే 1.66 మిల్లీసెకన్లు తక్కువ నమోదయ్యాయి.
లీప్ సెకన్ ప్రభావం?
టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు, కంప్యూటర్లు, ఆర్థిక లావాదేవీలు, ఎలక్ట్రిక్ గ్రిడ్‌లు, జీపీఎస్ శాటిలైట్లు వంటి అనేక వ్యవస్థలు సమయంపై ఆధారపడి పనిచేస్తాయి. ఇంతవరకు ఇవి పాజిటివ్ లీప్ సెకన్‌నే చూశాయి. నెగటివ్ లీప్ సెకన్ వల్ల ఇవి ఎలా ప్రభావితమవుతాయో చెప్పడం కష్టం అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఉంచాలా.. తీసేయాలా?
⇒ ‘లీప్ సెకన్ అనేది మనం సృష్టించింది. ఈ లీప్ సెకన్ పద్ధతినే తీసేస్తే గొడవ ఉండదు కదా’ అని వాదించేవారు లేకపోలేదు.
⇒ ‘గడియారంలోంచి మనం తీసేయగలం. కానీ, భూభ్రమణంలో వచ్చే మార్పులను చెరిపేయలేం. సుదీర్ఘకాలంలో మానవాళిపై వాటి ప్రభావాన్ని తుడిచేయలేం. భూమి నెమ్మదిగానో వేగంగానో తిరుగుతోందని.. అందుకు భూతాపం వంటివి కారణమవుతున్నాయని తెలుసుకునేందుకు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఉండాల్సిందే’ అని గట్టిగా వాదిస్తున్నవారూ ఉన్నారు.