పతనాపురంలో పతనం: నటుడు గణేష్‌కు ఘోర పరాజయం | Oommen Chandy Factor Ends 25 Year Reign Pathanapuram | Sakshi
Sakshi News home page

పతనాపురంలో పతనం: నటుడు గణేష్‌కు ఘోర పరాజయం

May 6 2026 1:51 PM | Updated on May 6 2026 2:11 PM

Oommen Chandy Factor Ends 25 Year Reign Pathanapuram

పతనాపురం: దక్షిణ కేరళ రాజకీయ ముఖచిత్రాన్ని కుదిపేస్తూ, ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాతికేళ్ల పాటు పతనాపురం నియోజకవర్గంలో తిరుగులేని ఏకచత్రాధిపత్యం వహించిన కేరళ కాంగ్రెస్ (బీ) అగ్రనేత, వెటరన్ సినీ నటుడు కెబి గణేష్ కుమార్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీపై ప్రజల్లో వెల్లువెత్తిన అపారమైన సానుభూతి, సొంత పార్టీలో తలెత్తిన విభేదాలు కలిసి మొత్తంగా ఒక బలమైన నాయకుని రాజకీయ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాయి.

వెంటాడిన ‘సోలార్ వివాదం
గణేష్ కుమార్ ఊహించని పతనానికి ప్రధాన కారణం ‘ఊమెన్‌ చాందీ ఫ్యాక్టర్’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఊమెన్‌ చాందీని ‘సోలార్ స్కామ్’లో ఇరికించేందుకు భారీ కుట్ర జరిగిందని, అందులో భాగంగా ఒక లేఖలో నాలుగు కల్పిత పేజీలను గణేష్ కుమారే స్వయంగా చేర్పించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో ఈ అంశం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఊమెన్‌ చాందీ కుమారుడు చాంద ఊమెన్‌ రంగంలోకి దిగి, తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడంతో, పతనాపురం ఓటర్లు ఈ కుట్రలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.

చేజారిన మద్దతు.. కూలిన కోట
ఒకప్పుడు గణేష్ కుమార్ విజయాలకు బలమైన పునాదిగా నిలిచిన నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్ఎస్ఎస్) ఈసారి ఆయనకు మద్దతు ఉపసంహరించుకోవడం గట్టి దెబ్బతీసింది. స్థానిక వివాదాల కారణంగా ఎన్ఎస్ఎస్ తాలూకా యూనిట్ ఆయనకు దూరమైంది. అంతేకాకుండా, ఆర్. బాలకృష్ణ పిళ్లై మరణానంతరం కేరళ కాంగ్రెస్ (బీ) పార్టీ పగ్గాలు చేపట్టిన గణేష్ కుమార్, తన ఏకపక్ష పోకడలతో పార్టీలోని సీనియర్ నేతలను, విధేయులను దూరం చేసుకున్నారు. ఈ అంతర్గత విభేదాలు ఆయన ఓటమికి ఆజ్యం పోశాయి.

ఉనికి కోల్పోయిన కేరళ కాంగ్రెస్ (బీ)
ఈ ఘోర పరాజయం ఒక నాయకుడికి మాత్రమే పరిమితం కాలేదు. కేరళ కాంగ్రెస్ (బీ) పార్టీ ఉనికినే తీవ్ర ప్రశ్నార్థకం చేసింది. పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర శాసనసభలో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి రావడం ఇదే తొలిసారి. చరిత్రాత్మకంగా కొట్టారక్కర, పతనాపురం నియోజకవర్గాలనే నమ్ముకున్న ఈ పార్టీ, ఇప్పుడు ఆ రెండు స్థానాలను కోల్పోయి, కేవలం కొద్దిమంది స్థానిక ప్రజాప్రతినిధులకే పరిమితమైంది. గణేష్ కుమార్ తన గత అభివృద్ధి పనులను ప్రచారంలోకి తెచ్చినా, ప్రజలు మాత్రం నైతికతకే పట్టం కట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement