
కేరళ, యూపీ, హరియాణా, గుజరాత్‌లు తప్ప ఏ రాష్ట్రంలోనూ రూ.100 కోట్లు దాటని బడ్జెట్
2023–24లో తెలంగాణ రూ.8.40 కోట్లే
ఏపీలో అయితే 2024–25 కాలంలో జీరో బడ్జెట్
నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఉండాల్సిన రాష్ట్రాల సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్‌లు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, విపత్తు నిర్వహణ, డిజిటల్ హెరిటేజ్ సెంటర్‌ల అభివృధ్ధి, జీఐ మ్యాపింగ్, రిమోట్ సెన్సింగ్, ఆరోగ్య సంరక్షణ పరికరాల తయారీ వంటి రంగాల పరిశోధనలో కౌన్సిల్‌లు కీలక పాత్ర పోషించేవి.
అయితే సంస్థాగత లోపాలు, మానవ వనరుల కొరతకుతోడు కేంద్రప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు బాగా తగ్గడంతో సైన్స్, టెక్నాలజీ మండళ్లు పూర్తిగా నీరుగారిపోతున్నాయని నీతి ఆయోగ్ ఆక్షేపించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘రాష్ట్రాల శాస్త్రసాంకేతికత మండళ్ల బలోపేతానికి మార్గసూచీ’నివేదికలో నీతి ఆయోగ్ పలు అంశాలను ప్రస్తావించింది.
సిబ్బంది, నిధుల కరువు
శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణల కోసం రాష్ట్రాలు వెచ్చిస్తున్న బడ్జెట్ 2023–24 ఏడాదితో పోలిస్తే 2024–25లో సగటున 17 శాతం మేర పెరిగినట్లు కనిపిస్తున్నా వాస్తవంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే సమధిక నిధులు కేటాయించాయి. ప్రతిరాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన నిధుల వాటా తెగ్గోసుకుపోతోంది. 2024–25లో కేరళ అత్యధికంగా రూ.173.34 కోట్లు, గుజరాత్ రూ.161 కోట్లు, హరియాణా రూ.130కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్ రూ.140 కోట్లు కేటాయించారు.
ఇవి మినహా మరే ఇతర రాష్ట్రం వంద కోట్లకు మించి బడ్జెట్‌ను కేటాయించకపోవడం విచారకరమని నీతి ఆయోగ్ పేర్కొంది. తెలంగాణ సర్కార్ 2023–24లో రూ.8.40 కోట్ల నిధులు కేటాయించింది, 2024–25లో రూ.19.23 కోట్లకు పెంచారు. అయితే ఇందులో రాష్ట్రానికి కేంద్ర నిధులు రూ.96 లక్షలు మాత్రమే అందాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2023–24లో రూ.4.84 కోట్లు కేటాయించారు. 2024–25 ఏడాదిలో ఒక్క రూపాయి నిధులు పెంచలేదు.
కొన్ని రాష్ట్రాలు పాక్షిక కేంద్ర సహాయాన్ని పొందుతున్నప్పటికీ, కేంద్రం నుంచి కేటాయింపులు 2024–25 ఏడాదిలో రూ.50 కోట్ల కన్నా తక్కువగా ఉన్నాయని నీతి ఆయోగ్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీల నుండి ప్రాజెక్టు ఆధారిత నిధులను రాబట్టడంతో రాష్ట్రాల మండళ్లు పూర్తిగా వెనుకబడ్డాయని వివరించింది. కొన్ని రాష్ట్రాల కౌన్సిల్‌లు మాత్రం సైన్స్ పార్కులు, సైన్స్ సిటీలను ఏర్పాటు చేయడానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, సాంస్కృతిక శాఖలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
అనేక రాష్ట్రాలు తమ పాలక మండలి సమావేశాలను క్రమం తప్పకుండా ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నాయి. దాంతో నిర్ణయం తీసుకోవడంలో జాప్యం అవుతోంది. దీంతో కీలక కార్యక్రమాల అమలు కుంటువడుతోంది. కొన్ని మండళ్లకు కాస్తంత మెరుగ్గా నిధులు మంజూరైనప్పటికీ ఆ నిధుల సద్వినియోగం జరగట్లేదు. ఆర్థికంగా బలంగా లేకపోవడం, పరిపాలనా అడ్డంకులు, సిబ్బంది కొరత కారణంగా మండళ్లలో విస్తృతస్థాయిలో పరిశోధనలు జరగట్లేదు. దీంతో వాటి సామర్ధ్యం తగ్గిపోతోందని నీతి ఆయోగ్ పేర్కొంది.