ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా?

NGT does not have suo motu powers - Sakshi

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ పరిధిపై సుప్రీంకోర్టు విచారణ

ఎన్జీటీకి అధికార పరిధి లేదన్న సీనియర్‌ న్యాయవాదులు

రాజ్యాంగ న్యాయస్థానాలే సుమోటో ఉపయోగించాలి: అమికస్‌ క్యూరీ

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ప్రెస్‌ నోట్‌ ఆధారంగా జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) విచారణ చేపట్టవచ్చా? బాధితుడి తరఫున ట్రిబ్యునల్‌ సభ్యుడు విచారణ ప్రారంభించవచ్చా? పార్టీతో ట్రిబ్యునల్‌ సభ్యుడు జతకట్టే అవకాశం లేదా?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) చట్టం–2010 ప్రకారం.. పత్రికల్లో వచ్చే కథనాలు, లేఖలు, విజ్ఞప్తులు ఆధారంగా ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా? అనే అంశంపై జస్టిస్‌ ఎం.ఎం.ఖానీ్వల్కర్, జస్టిస్‌ హృషికేశ్, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది.

ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా వ్యర్థాల తొలగింపుపై ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టి, ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ గ్రేటర్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే కేరళలో క్వారీల ఏర్పాటుకు నివాస స్థలాల నుంచి కనీస దూర నియమాన్ని 200 మీటర్లు నుంచి 50 మీటర్లకు తగ్గించారంటూ వచ్చిన విజ్ఞప్తి ఆధారంగా ఎన్జీటీ ఆదేశాలపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేరళ కేసులో ఎన్జీటీకి అధికార పరిధి ఉందని హైకోర్టు నిర్ధారించినప్పటికీ కొత్త క్వారీల కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేసింది.  

నిబంధనలు సమగ్ర ప్రాతిపదికన చదవాలి
ఎన్జీటీకి న్యాయ సమీక్ష చేసే అధికారం లేదని ఎన్జీటీ చట్టంలోని సెక్షన్‌ 14 చెబుతోందని థామ్సన్‌ అగ్రిగేట్స్, క్రిస్టల్‌ అగ్రిగేట్స్‌ సంస్థల తరఫు సీనియర్‌ న్యాయవాది వి.గిరి పేర్కొన్నారు. ట్రిబ్యునల్‌ పరిధి విస్తరణ నిర్ణయం విషయంలో సెక్షన్‌ 14(1), (2)లు కలిపి చదవాలని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్‌ దరఖాస్తు స్వీకరించడానికి అవసరమైన షరతులను సెక్షన్‌ 14(3) వివరిస్తోందని, ఎవరైనా దరఖాస్తుతో వస్తే సెక్షన్‌ 14లోని సబ్‌సెక్షన్‌ 3 ప్రకారం స్వీకరించాలని, అంతేకానీ ఓ లేఖ ద్వారా విచారణ చేపట్టరాదని వి.గిరి తెలిపారు.

ఆర్టికల్‌ 323ఏ ప్రకారం ఎన్జీటీ ఏర్పాటు కాలేదు
ఆర్టికల్‌ 323ఏ ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్‌ ఎన్జీటీ కాదని కేరళ తరఫున్యాయవాది జైదీప్‌ గుప్తా తెలిపారు. అందుకే శాసన అధికారాలను సమీక్షించే అధికారం ఎన్జీటీకి లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226, 32 కింద హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉన్న అధికారాలు ఎన్జీటీకి లేవన్నారు. ఎన్జీటీ చట్టంలోని ఏ ప్రొవిజన్‌ కూడా ట్రిబ్యునల్‌కు సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పలేదని గుర్తుచేశారు. ఎన్జీటీ సుమోటోగా కేసు చేపట్టాలంటే చట్టంలో ఉండాలని జైదీప్‌ తెలిపారు. అధికార పరిధి ఉన్న కోర్టులు కూడా చట్టబద్ధమైన నిబం« దనలకు వ్యతిరేకంగా వెళ్లవని వ్యాఖ్యానించారు.  

శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలి
ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేదు, ఎందుకంటే చట్టం ఆ మేరకు అవకాశం కల్పించలేదని ఓ పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ధ్రువ్‌ మెహతా తెలిపారు. శాసనంలోని భాష నుంచి శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంట్‌ ఉద్దేశపూర్వకంగా ట్రిబ్యునల్‌కు అలాంటి అధికారం ఇవ్వలేదన్నారు. ఒకవేళ ఎన్జీటీకి సుమోటో అధికార పరిధి ఉందని చెబితే, చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టాల్సి వస్తుందని ధ్రువ్‌ మెహతా పేర్కొన్నారు.

అధికారం లేకున్నా  చట్టం ద్వారా నిరోధించలేం
ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేకున్నా చట్టం ద్వారా దాని పనితీరును నిరోధించలేమని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి తెలిపారు. సుమోటో విచారణలో ఎన్జీటీ బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. అయితే, ట్రిబ్యునల్‌కు ఎలాంటి సుమోటో అధికారాలు లేవని ఆమె తెలిపారు.  

రాజ్యాంగబద్ధమైన కోర్టులకే అధికారం  
రాజ్యాంగబద్ధమైన కోర్టులే సుమోటో విచారణలు చేపట్టాలని అమికస్‌ క్యూరీగా హాజరైన సీనియర్‌ న్యాయవాది ఆనంద్‌ గ్రోవర్‌ తెలిపారు. నేషనల్‌ ఎన్విరానిమెంటల్‌ అప్పీలేట్‌ అథారిటీ యాక్ట్‌ 1997 ప్రకారం ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పారు. కానీ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్స్‌ యాక్ట్‌–2010 వచ్చాకా అథారిటీ యాక్ట్‌ రద్దయిందన్నారు. ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే గ్రీన్‌ ట్రైబ్యునల్‌ యాక్ట్‌ ఉందని గ్రోవర్‌ స్పష్టం చేశారు. ‘‘ఒకవేళ ట్రిబ్యునల్‌ దృష్టికి ఏదైనా అంశం వస్తే అప్పుడు తప్పనిసరిగా విచారణ చేపట్టాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.

లా కమిషన్‌ నివేదిక చెబుతోంది
ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనేది చట్టసభల ఉద్దేశమని 186వ లా కమిషన్‌ నివేదిక చెబుతోందని ఓ పిటిషనర్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సాజన్‌ పూవయ్య వెల్లడించారు. ఎన్జీటీకి విస్తృత అధికారాలు ఇవ్వడాన్ని ‘స్థానిక’ అంశాలు డైల్యూట్‌ చేసినప్పటికీ సుమోటోగా కేసులు స్వీకరించే అధికారం పొందేంతగా లేదని స్పష్టం చేశారు. అప్లికేషన్‌ ద్వారానే విచారణ చేపట్టాలనే అధికార పరిధిని చట్టం పేర్కొందని, సుమోటో విచారణల ద్వారా కాదని తెలిపారు. ప్రతిపాదిత ట్రిబ్యునళ్ల పరిధి దాటి ఉద్దేశపూర్వకంగానే క్రిమినల్‌ అప్పీలేట్, న్యాయ సమీక్ష హైకోర్టుల పరిధిలోకి తీసుకొచ్చామని లాకమిషన్‌ నివేదిక స్పష్టం చేసిందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top