
- దీర్ఘకాలిక వ్యాధుల బారిన ఐటీ ఉద్యోగులు
- హైదరాబాద్‌లో 84% ఉద్యోగులకు ఫ్యాటీ లివర్ సమస్య
- 34 శాతం మందికి మెటబాలిక్ సిండ్రోమ్
- పని ఒత్తిడి, క్రమం తప్పిన జీవనశైలే ప్రధాన కారణం
- ఆఫీసుల్లో ‘యోగా బ్రేక్’తప్పనిసరి చేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులంటే.. వాళ్లకేంటి బాబూ లక్షల్లో జీతం.. వీకెండ్స్ హాలీడేస్.. కాస్మోపాలిటన్ వర్క్ కల్చర్.. విలాసవంతమైన జీవనం అని ఠక్కున అనేయకండి. నాణేనికి రెండో వైపులాగే ఐటీ ఉద్యోగులను తీవ్ర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. జీవనశైలి, అధిక పని ఒత్తిడితో రకర కాల వ్యాధుల బారినపడుతున్నారు. హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ (ఐటీ) ఉద్యోగులలో 84% మంది ఫ్యాటీ లివర్ (కాలేయంలో అధిక కొవ్వు) బారిన పడ్డారని ఏకంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా లోక్‌సభలో ప్రకటించారు. ఇదొక నిశ్శబ్ద మహమ్మారిగా మారిందని, దీనిని నియంత్రించేందుకు అన్నివర్గాల సమన్వయంతో తక్షణ చర్యలు అవసరమని నొక్కి చెప్పారు. 2025లో నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనాన్ని కేంద్ర మంత్రి ఉదహరించారు.
క్రమం తప్పిన జీవన శైలి
ఐటీ పరిశ్రమలో ఉండే పని ఒత్తిడికి తోడు క్రమం తప్పిన పని వేళలు, ఆహార అలవాట్లతో ఉద్యోగులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటంతో జీవక్రియ దెబ్బతింటోంది. దానివల్ల కాలేయంలో కొవ్వు (ఫ్యాటీ లివర్– ఎంఏఎఫ్‌ఎల్‌డీ) పెరిగిపోయి వ్యాధులకు దారితీస్తోంది. హైదరాబాద్‌లో సర్వే చేసిన ఐటీ ఉద్యోగులలో 71 శాతం మందికి ఊబకాయం, 34 శాతం మందికి మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలు ఉన్నట్లు తేలింది. వీటి వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు వంటి సమ స్యలు పెరుగుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ ఈ అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. సాధారణంగా హృద్రోగం, మధుమేహం, కేన్సర్, శ్వాస సంబంధ సమస్యలు వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్ సీడీ)లన్నీ 40 ఏళ్ల తర్వాతే వస్తుంటాయి. కానీ, ఐటీ ఉద్యోగుల్లో మాత్రం అవి 30 ఏళ్ల లోపే వస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్, రెడీమేడ్ ఆహారం తీసుకోవటం, కదలకుండా గంటల కొద్దీ ఒకే చోట కూర్చోవటం కూడా ఈ అనారోగ్యాలకు కారణాలని సర్వేలో తేలింది.
యోగా బ్రేక్ తప్పనిసరి..
సంస్థల యాజమాన్యాలకే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా యువ, పట్టణ శ్రామిక శక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అత్యంత కీలకం. అందుకే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌పీ–ఎన్‌సీడీ) కింద ఆరోగ్య మంత్రిత్వ శాఖ కంపెనీల యాజ మాన్యాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగులకు తప్పని సరిగా 5 నిమిషాల పాటు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో కూడిన ‘యోగా బ్రేక్’ఇవ్వాలని ఆదేశించింది. ఇది శారీరక, మానసిక శ్రేయ స్సుకు అత్యవసరం. దీంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్ప కుండా వ్యాయామం, బరువు నియంత్రణ, చక్కెర, అధిక కొవ్వు పదార్థాలను తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది.