
బరేలీ: దేశంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. ఇటువంటి నేపధ్యంలో బాధితుల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతోంది. తాజాగా వివాహితుని చేతిలో అత్యాచారానికి గురైన ఒక మైనర్ బాలిక శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు పుట్టిన 30 నిమిషాలకే కన్నుమూసింది.
బాధిత చిన్నారి తనకు కడుపు నొప్పి వస్తున్నదంటూ తరచూ తల్లిదండ్రులకు చెప్పేది. ఈ నేపధ్యంలో బాలిక కుటుంబ సభ్యులు ఆమెను గురువారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత బాలిక గర్భిణి అనే విషయం వెలుగు చూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకుంది. బాలికకు ఏడవ నెలలోనే శిశు జననం జరిగింది. శిశువు పుట్టిన 30 నిముషాలకే కన్నుమూసింది. ఈ ఘటనలో బాధిత చిన్నారిని బెదిరించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన యూపీలోని బరేలీకి చెందిన రషీద్(31)ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇద్దరు పిల్లల తండ్రి అయిన రషీద్ ఏడు నెలల క్రితం బాధిత చిన్నారికి పండు ఇస్తానని చెప్పి, తన ఇంటికి పిలిచాడు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తరువాత తరచూ చిన్నారిపై అత్యచారం చేస్తూ వచ్చాడు. తాజాగా బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పుడు, అల్ట్రాసౌండ్ పరీక్షలో బాధిత చిన్నారి ఏడు నెలల గర్భిణి అని వెల్లడైంది.
దీంతో బాలికను జిల్లా మహిళా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారి అదే రోజు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపధ్యంలో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. తరువాత నెమ్మదిగా కుదుటపడిందని వైద్యులు తెలిపారు. అయితే బాలికకు జన్మించిన శిశువు మృతిచెందింది. ఈ ఘటనను ధృవీకరించిన నవాబ్‌గంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ, నిందితుడు రషీద్‌పై కేసు నమోదయ్యిందని, దర్యాప్తు జరుగుతున్నదని తెలిపారు.