పేరులో నేముంది? | Many Candidates with Same Names in the Kerala Assembly Elections 2026 | Sakshi
Sakshi News home page

పేరులో నేముంది?

Apr 2 2026 5:31 AM | Updated on Apr 2 2026 5:46 AM

Many Candidates with Same Names in the Kerala Assembly Elections 2026

కేరళలో పార్టీలకు పేర్ల తంటా

ఒకే పేరుతో బరిలో పలువురు

అధికార, విపక్ష కూటముల్లో గుబులు

కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరుకుంటోంది. అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీ ఎఫ్‌ హోరాహోరీ తలపడుతుండగా బీజేపీ సార థ్యంలోని ఎన్డీఏ కూడా ఉనికి చాటుకునే ప్రయ త్నాల్లో ఉంది. అయితే ప్రధాన పార్టీలకు ‘పేర్ల గొడవ’ పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది. తమ అభ్యర్థుల పేరుతోనే ఉన్న పలువురు వ్యక్తులు పోటీలో ఉండటంతో అవి తల పట్టుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా వారిని నయానో భయానో బరి నుంచి తప్పించే పనిలో పడ్డాయి. లేదంటే వాటి ఓట్లకు ఎంతో కొంత గండి పడే పరిస్థితి నెలకొంది. అన్ని స్థానాల్లోనూ అధికార, విపక్ష కూటముల నడుమ హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో కొన్ని ఓట్లు తగ్గినా తమ గెలుపోటములే ప్రభావితం అవుతాయంటూ పార్టీలన్నీ ఆందోళన చెందుతున్నాయి.

విజయన్‌పై విజయన్‌ 
ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పోటీ చేస్తున్న ధర్మదాం నియోజకవర్గంలో కన్నూరుకు చెందిన ఎ.ఎం.విజయన్‌ అనే మరో వ్యక్తి కూడా ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశాడు! తిరువంబాడిలో ముస్లిం లీగ్‌ నేత ఖాసింపై అదే పేరుతో ఉన్న మరో ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎర్నాకులం జిల్లా కాలంసెరి స్థానంలో మంత్రి పి.రాజీవ్‌ కూడా ఇలాంటి పరీక్షే ఎదుర్కొంటున్నారు. రాజీవ్‌ పేరుతో అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నారు. 

అంబలపుజ స్థానంలో సీపీఎం సీనియర్‌ నేత జి.సుధాకరన్‌కు టికెట్‌ దక్కకపోవడంతో ఆయన రెబెల్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సుధాకరన్‌ అనే పేరున్న మరో అభ్యర్థి కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. కోయిలాండిలో కాంగ్రెస్‌ నేత కె.ప్రవీణ్‌కుమార్‌పై అదే పేరుతో ఉన్న మరో అభ్యర్థి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రమేశ్‌ చెన్నితాల పోటీ చేస్తున్న హరిపాద్‌ స్థానంలో రమేశ్‌ అనే మరో వ్యక్తీ బరిలో ఉన్నారు. ఇరింజలకుండ స్థానంలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి థామస్‌ ఉన్నితాన్‌కు థామస్‌ అనే స్వతంత్రుని నుంచి సవాలు ఎదురవుతోంది.

బైపోర్‌లో గమ్మత్తు
కోజికోడ్‌ జిల్లాలోని బైపోర్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ నేత పి.వి.అన్వర్‌ బరిలో ఉండగా అదే పేరుతో ఏకంగా మరో నలుగురు పోటీ చేస్తున్నారు! ఎల్డీఎఫ్‌ తరఫున పర్యాటక మంత్రి పి.ఎ.మహ్మద్‌ రియాజ్‌ పోటీ చేస్తున్నారు. అదే పేరుతో మరో ఇద్దరు కూడా బరిలో ఉన్నారు! వట్టియూర్కవు అసెంబ్లీ స్థానంలోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వి.కె.ప్రశాంత్‌పై కె.ప్రశాంత్‌ అనే స్వతంత్రుడు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి కె.మురళీధరన్‌ పోటీ చేస్తుండగా అదే పేరుతో మరో అభ్యర్థి కూడా బరిలో నిలిచారు.

ప్రధాన పార్టీలకు ‘ప్రసాద్‌’
చెర్తాల స్థానంలో ప్రధాన కూటముల అభ్యర్థులిద్దరిదీ ఒకే పేరు కావడం విశేషం. ఎల్డీఎఫ్‌ నుంచి మంత్రి పి.ప్రసాద్, కాంగ్రెస్‌ నుంచి కె.ఆర్‌.రాజేంద్రప్రసాద్‌ పోటీ చేస్తున్నారు! ఇది చాలదన్నట్టు ప్రసాద్‌ అనే మరో వ్యక్తి కూడా స్వతంత్రునిగా ఇక్కడ బరిలో నిలిచారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement