నీట్ పై కీలక వ్యాఖ్యలు : చిక్కుల్లో హీరో సూర్య

Madras HC judge wants contempt proceedings against actor Suriya - Sakshi

మద్రాస్ హైకోర్టు జడ్జి ఆగ్రహం 

కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాంటూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ

సాక్షి, చెన్నై: నీట్ పరీక్షపై స్పందించిన నటుడు సూర్య న్యాయపరమైన ఇబ్బందుల్లో పడనున్నారు. దేశంలోని న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను విమర్శించిన సూర్యపై కోర్టు ధిక్కార చర్యల తీసుకోవాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.ఎం.సుబ్రమణ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే  సూర్యపై ధిక్కార చర్య దిశగా అడుగులు పడటం సంచలనంగా మారింది.

మీడియా, యూట్యూబ్‌లో నీట్ ప్రవేశ పరీక్షలపై సూర్య ప్రకటనను చూశానని జస్టిస్ ఎస్.ఎమ్. సుబ్రమణ్యం చెప్పారు. ఈ సందర్భంగా సూర్య వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ, ఆయనపై కోర్టు ధిక్కార చర్యల్ని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి అమ్రేశ్వర్ ప్రతాప్ సాహికి లేఖ రాశారు. న్యాయవ్యవస్థను కించపర్చేవిగా ఆయన వ్యాఖ్యలున్నాయని ఆయనపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ ధోరణి న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసానికి ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సూర్యపై ధిక్కార చర్యలను ప్రారంభించి ‘భారతీయ న్యాయ వ్యవస్థ ఘనతను చాటి చెప్పాలని’ ప్రధాన న్యాయమూర్తిని సుబ్రమణ్యం  అభ్యర్థించారు.

కరోనా కాలంలో నీట్  పరీక్షలు నిర్వహిస్తున్న వైనం, కేంద్ర ప్రభుత్వ విద్యావిధానాన్ని గతంలో కూడా తప్పుబట్టిన సూర్య భయం, ఒత్తిడి కారణంగా తమిళనాడులో ఒకేరోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య ఘటనలతో చలించిపోయారు. కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యాయం చేస్తున్నగౌరవనీయ న్యాయమూర్తులు విద్యార్థులను మాత్రం భయం లేకుండా నీట్ పరీక్షకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరమంటూ ఘాటుగా విమర్శించారు. ఇలాంటి పరీక్షలను ‘మనునీతి పరీక్షలు’లుగా అభివర్ణించిన సూర్య వీటివల్ల విద్యార్థుల జీవితాలను బలి తీసుకోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. అంతేకాదు ఈ ఆత్మహత్యలు తల్లిదండ్రులకు జీవితకాల శిక్షగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, కోర్టులు క్రూరంగా వ్యవహరిస్తున్నాయంటూ ట్విటర్ లో ఒక ప్రకటన విడుదల చేశారు.  దీంతో సూర్యను పలువురు ప్రశంసించడంతోపాటు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ పోస్ట్  వైరల్ అయ్యింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top