ఆదర్శ ప్రేమజంట.. మతిచెడి వచ్చారు.. మనసిచ్చిపుచ్చుకున్నారు..

Love Marriage of Two Patients Of Chennai mental health Institute - Sakshi

మోడువారిన చెట్టు చిగురిస్తే.. బీడు భూమిని వర్షపు చినుకు పలకరిస్తే.. ఆ ఆనందమే వేరు. ఆ అనుభూతికి ఏదీ సరికాదు. ఇది అక్షరాల నిజం అంటోంది.. ఆ జంట. అవును.. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలుతిని వారు మానసిక రోగులయ్యారు.. చివరికి.. తమవారెవరో కూడా గుర్తించలేని దుస్థితికి చేరుకున్నారు. చికిత్స పొందే సమయంలో ఒకరిపై ఒకరు ఆప్యాయత పెంచుకున్నారు.

తమకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ఆస్పత్రి సిబ్బంది సాయంతోనే నేడు ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. ఉన్నత చదువులు చదివినా.. జీవితమనే వెకుంఠపాళిలో చిక్కి.. శల్యమై.. భవిష్యత్‌పై ఆశలు వదిలేసుకున్న రెండు మనస్సులు.. బాధలను దిగమింగి.. కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాయి. వారికి మనమూ చెబుతాం.. ఆల్‌..ది..బెస్ట్‌..! 

సాక్షి, చెన్నై:  ప్రేమ.. ఈ రెండక్షరాల పదం.. ఇద్దరి మనస్సులను ఒక్కటి చేస్తుంది. పాతాలానికి పడిపోయినా.. ప్రపంచాన్ని ఎదిరించగలమనే శక్తినిస్తుంది. దీన్ని అక్షరాల నిజం చేసింది ఆ జంట. వివరాలు.. చెన్నై కీల్పాకం మానసిక రోగుల ఆసుపత్రికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ వందలాది మంది మానసిక రోగులు చికిత్స తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇందులో చెన్నైకు చెందిన పీజీ పట్టభద్రుడైన మహేంద్రన్‌ (42) కూడా ఉన్నాడు.

కుటుంబ గొడవలతో అతడు మానసిక రోగిగా మారాడు. ఇతడిని చికిత్స నిమిత్తం స్థానికులు కీల్పాకం మానసిక రోగుల ఆసుపత్రిలో చేర్చారు. ఇక్కడే వేలూరుకు చెందిన టీచర్‌ దీప (36) కూడా చికిత్స పొందుతున్నారు. తండ్రి మరణంతో తీవ్ర మనో వేదన గురై.. ఆమె మానసిక రోగిగా మారారు. ఈ ఇద్దరికీ ఆసుపత్రి డైరెక్టర్‌ పూర్ణ చంద్రిక నేతృత్వంలోని సిబ్బంది చికిత్స   అందించారు. ఈ సమయంలో మహేంద్ర, దీప కలిసి మెలిసి ఉండేవారు. 
 

వెళ్లనని మారం చేసి మరీ... సేవలోకి.. 
రెండేళ్ల చికిత్స తర్వాత మహేంద్రన్, దీప సంపూర్ణ ఆరోగ్య వంతులయ్యారు. ఆసుపత్రి జీవితం నుంచి బయటి ప్రపంచంలో విహరించేందుకు వీరికి అవకాశం వచ్చింది. అయితే, తాము ఆసుపత్రి నుంచి వెళ్లబోమని, మిగిలిన వారికి సాయం చేస్తూ.. జీవితాన్ని సాగిస్తామని పట్టుబట్టి.. అక్కడే పనిలో చేరారు. రోగుల శిక్షణ కేంద్ర పర్యవేక్షణ పనుల్లో మహేంద్రన్, వంట పనుల్లో దీప భాగమయ్యేవారు. ఈ క్రమంలో వారు మరింతగా ఒకరిపై ఒకరు ఆప్యాయత పెంచుకున్నారు. ఓ రోజు మహేంద్రన్‌ ప్రేమిస్తున్నట్లు దీపాకు చెప్పాడు. ఆమెకు కూడా అంగీకరించడంతో ఈ విషయాన్ని డైరెక్టర్‌ పూర్ణ చంద్రికకు చెప్పి..తన భవిష్యత్‌కు కొత్త బాట వేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించారు.

వీరి ప్రేమను గుర్తించిన ఆస్పత్రి వర్గాలు తామే దగ్గరుండి వివాహం చేస్తామని ఆ జంటకు హామీ ఇచ్చాయి. ఆస్పత్రి ఆవరణలోని సిద్ధి , బుద్ధి వినాయకుడి ఆలయంలో శుక్రవారం వివాహానికి  ఏర్పాట్లు చేశారు. కాగా వివాహ అనంతరం ఈ దంపతుల కొత్త జీవితానికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులను తమ సొంత నగదుతో కొనుగోలు చేసి అందించాలని ఆసుపత్రి సిబ్బంది నిర్ణయించడం విశేషం. దీపావళి వేళ నిశ్చయం అయిన వీరి వివాహం.. దీప.. మహేంద్రన్‌ జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపాలని మనమూ కోరుకుందాం.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top