శ్రీరాముడే స్ఫూర్తి: మోదీ

Lord Ram inspiration behind Sabka Saath Sabka Vikas says PM Narendra Modi - Sakshi

అయోధ్యలో రామ్‌లల్లా సందర్శన

సరయూ తీరంలో దీపోత్సవం  

15.76 లక్షల దీపాలతో గిన్నిస్‌ రికార్డు

అయోధ్య:  ప్రభుత్వ నినాదం ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌’కు శ్రీరాముడి పాలన, ఆయన అందించిన విలువలే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపోత్సవంలో పాల్గొన్నారు. ప్రజలు వెలిగించిన 15.76 లక్షల దీపాలతో సరయూ తీరం వెలుగులతో కనువిందు చేసింది. ఈ కార్యక్రమం గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది.

3డీ హోలోగ్రాఫిక్‌ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ షోను, మ్యూజిక్‌ షోను మోదీ తిలకించారు. భవ్య రామమందిర నిర్మాణానికి ఆయన 2020 ఆగస్టు 5న భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన అయోధ్యకు రావడం ఇదే తొలిసారి. తొలుత రామజన్మభూమి స్థలంలోని తాత్కాలిక ఆలయంలో రామ్‌లల్లాను మోదీ దర్శించుకున్నారు. దీపం వెలిగించారు. ప్రత్యేక పూజలు చేశారు. హారతి అందుకున్నారు. అనంతరం రామ మందిర నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

రామకథా పార్కులో శ్రీరాముడు, సీతల ప్రతీకాత్మక పట్టాభిషేక కార్యక్రమంలో మోదీ పాలుపంచుకున్నారు. పుష్పక విమానం(హెలికాప్టర్‌) నుంచి రాముడు, లక్ష్మణుడు, సీత పాత్రధారులు దిగడం అందరినీ అకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. రాముడి ఆశయాలు, విలువలు రాబోయే 25 ఏళ్లలో మన లక్ష్యాల సాధనకు దిక్సూచి అని చెప్పారు. మన రాజ్యాంగ ఒరిజినల్‌ కాపీపై రాముడు, లక్ష్మణుడు, సీతామాత చిత్రాలు ఉన్నాయని గుర్తుచేశారు. మన రాజ్యాంగ హక్కులకు అది మరో గ్యారంటీ అని అభివర్ణించారు.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top