Fourth lok Sabha Elections-1967: కాంగ్రెస్‌ కోటకు బీటలు | Sakshi
Sakshi News home page

Fourth lok Sabha Elections-1967: కాంగ్రెస్‌ కోటకు బీటలు

Published Tue, Apr 16 2024 1:21 AM

Lok sabha elections 2024: Brief history of the Fourth Lok Sabha elections-1967 - Sakshi

ఇందిరపై తిరుగుబాటు

పార్టీనుంచి బహిష్కరణ!

డీఎంకే, సీపీఐ దన్నుతో నిలిచిన ప్రభుత్వం

సంచలనాలకు వేదికైన నాలుగో లోక్‌సభ

దేశవ్యాప్తంగా బలపడ్డ ప్రాంతీయ పార్టిలు

తండ్రి నెహ్రూ వారసురాలిగా 1966లో ప్రధాని పీఠమెక్కిన ఇందిరాగాంధీ సరిగ్గా ఏడాది తిరిగే సరికి ప్రజాతీర్పు కోరాల్సిన పరిస్థితి! రాజకీయాల్లో ముక్కుపచ్చలారకపోయినా తొలిసారి ప్రజామోదం పొందడంలో ఆమె సక్సెసయ్యారు. కానీ సొంత పార్టీలో అసంతృప్తిని చల్లార్చలేకపోయారు.

ధరల పెరుగుదల, మందగించిన వృద్ధి, ఉపాధి కల్పన వంటి సమస్యలకు తోడు పార్టీని కూడా చక్కదిద్దుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి! చివరికి సొంత పార్టియే బయటకు గెంటినా తట్టుకుని నిలవడమే గాక విపక్షాల మద్దతుతో అధికారాన్ని నిలబెట్టుకుని సంకీర్ణ శకానికి తెర తీశారు ఇందిర. ఇలా 1967–70 నాలుగో లోక్‌సభ ఎన్నో సంక్షోభాలకు సాక్షిగా నిలిచింది...

చివరి జమిలి ఎన్నికలు
లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలపై ఇప్పుడు దేశంలో పెద్ద చర్చే నడుస్తోంది. కానీ మనకిదేమీ కొత్త కాదు. 1967 దాకా వరుసగా నాలుగు పర్యాయాలు దేశమంతటా ఇదే విధానంలో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు దీటైన ప్రతిపక్షం లేకపోవడంతో అక్కడా, ఇక్కడా పూర్తి పదవీకాలం పాటు ఆ పార్టీ ప్రభుత్వాలే రాజ్యమేలాయి.

నెహ్రూ మరణానంతరం కాంగ్రెస్‌ కోటకు బీటలు మొదలయ్యాయి. ఇందిర సారథ్యంలో పార్టీ అస్మదీయ, తస్మదీయ వర్గాలుగా విడిపోయింది. దాంతో 1967 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలం బాగా తగ్గిపోయింది. కేవలం 283 స్థానాలకే పరిమితమైంది. ఓట్ల శాతం కూడా 44.72 నుంచి 40కి తగ్గింది. ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులు ఓటమి పాలయ్యారు. స్వతంత్ర పార్టీ ఏకంగా 44 చోట్ల గెలిచి లోక్‌సభలో అతి పెద్ద విపక్షంగా నిలిచింది.

అఖిల భారతీయ జన్‌ సంఘ్‌ కూడా ఏకంగా 21 సీట్లు అదనంగా నెగ్గి బలాన్ని 35కు పెంచుకుంది.  ప్రజా సోషలిస్ట్‌ పార్టీ 13 సీట్లకు పరిమితమైంది. 1964లో దాన్నుంచి చీలి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ నేతృత్వంలో పుట్టుకొచి్చన సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ 23 సీట్లు గెలిచింది. సీపీఐ ఆరు సీట్లు కోల్పోయి 23కు పరిమితమైంది. సీపీఐ నుంచి ఆవిర్భవించిన సీపీఎం 19 చోట్ల గెలిచింది.

9 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు
లోక్‌సభతో పాటే జరిగిన  అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే సగం రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ దక్కింది. యూపీలో ఎన్నికలైన నెల రోజులకే చరణ్‌సింగ్‌ కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టిల మద్దతుతో తాను సీఎంగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్‌ నుంచి నేతల బహిష్కరణలు, రాజీనామాలు ప్రాంతీయ పార్టిల ఆవిర్భావానికి దారితీశాయి. పశి్చమబెంగాల్, బిహార్, ఒడిశాల్లో కాంగ్రెస్‌ మాజీలు వేరుకుంపటి పెట్టుకుని ఆ పార్టీని ఢీకొట్టారు. ఏకంగా 9 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి! తమిళనాట డీఎంకే అధికారంలోకి వచ్చి ఈ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టిగా నిలిచింది. మిగతా 8 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు కొలువుదీరాయి.

ఇందిర బహిష్కరణ
1969 నవంబర్‌ 12వ తేదీకి చరిత్రలో ప్రత్యేకత ఉంది. అదే రోజున ప్రధాని ఇందిరను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించారు! పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, వ్యక్తి ఆరాధనకు కేంద్రంగా మారారనే ఆరోపణలపై కాంగ్రెస్‌లోని ఇందిర వ్యతిరేక వర్గమైన “సిండికేట్‌’ ఈ చర్య తీసుకుంది. హిందీయేతర నాయకులతో, ముఖ్యంగా దక్షిణాది నేతలతో కూడిన ఈ వర్గంలో కీలక నేత, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎస్‌.నిజలింగప్ప తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సిండికేట్‌ వర్గానికి కామరాజ్‌ నాయకత్వం వహించారు. ఈ చర్యతో కాంగ్రెస్‌ రెండు ముక్కలైంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోని 705 మందిలో 446 మంది ఇందిర వెంట నడిచారు. ఆమె సారథ్యంలో కాంగ్రెస్‌ (ఆర్‌), సిండికేట్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ (ఓ)గా పార్టీ చీలిపోయింది. లోక్‌సభలో మెజారిటీ కోల్పోయినా సీపీఎం, డీఎంకే, సీపీఐ దన్నుతో ఇందిర సర్కారు మనుగడ సాగించింది.

ఎన్నెన్నో విశేషాలు...
► 1967 లోక్‌సభ ఎన్నికల్లో 61.1 శాతం ఓటింగ్‌ పోలైంది. మన దేశంలో అప్పటిదాకా నమోదైన గరిష్ట పోలింగ్‌ ఇదే.
► ఐదేళ్ల కాలం పూర్తి చేసుకోని తొలి లోక్‌సభ కూడా ఇదే. 1970 డిసెంబర్లో 15 నెలల ముందే రద్దయింది.
► రెండు వరుస యుద్ధాలు, రెండేళ్లు వరుసగా వానలు మొహం చాటేయడంతో పంటల దిగుబడి 20 శాతానికి పైనే తగ్గి ఆహార ధాన్యాలు అడుగంటాయి.
► దిగుమతులకు చెల్లింపుల సామర్థ్యం మరింత క్షీణించింది. ఆహారం కోసం అమెరికా రుణ సాయం తీసుకోవాల్సి వచి్చంది.
► స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా డాలర్‌తో రూపాయి విలువను ఎన్నికల ముందు 4.76 నుంచి 7.5కి తగ్గించారు.
► హరిత విప్లవం ఊపందుకోవడంతో 1971 కల్లా పంటల దిగుబడి 35 శాతం పెరిగింది.
► రాష్ట్రాల సంఖ్య 27కు పెరిగింది. దాంతో లోక్‌సభ స్థానాలు 494 నుంచి 520కి పెరిగాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

 
Advertisement
 
Advertisement