
తిరువనంతపురం: కేరళలో అత్యంత వైభవంగా 12 రోజుల పాటు ‘ఓనం’ ఉత్సవాలు జరిగాయి. అయితే పండగ సందడి భక్తప్రపత్తుల నడుమ కాకుండా మద్యం దుకాణాల చుట్టూ తిరగడం గమనార్హం. కేరళ ప్రభుత్వం ఈ ‘ఓనం’ వేడుకల రోజుల్లో ఎన్నడూ లేని రీతిలో అత్యధిక స్థాయిలో మద్యం విక్రయించింది. ఈ 12 రోజుల సీజన్‌లో మద్యం అమ్మకాలు రూ.970.74 కోట్ల భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టి, గత రికార్డులను బద్దలు కొట్టాయి.
గత ఏడాది ‘ఓనం’ మద్యం అమ్మకాల కన్నా ఈ ఏడాది తొమ్మిది శాతం అదనంగా మద్యం విక్రయాలు జరిగాయి. ఓనం ఉత్సవవాల్లో అత్యంత ముఖ్యమైన రోజుగా భావించే ‘ఉత్రాడం’నాడు జనం మద్యం కోసం రూ.137.64 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఈ 12 రోజుల వేడుకల్లో అత్యధిక మద్యం విక్రయాల రికార్డు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేరళలో మొత్తం మద్యం విక్రయాలు రూ.19,730 కోట్లు దాటాయి, కరుణగప్పల్లి అవుట్‌లెట్ ఒకే రోజున అత్యధిక విక్రయాలను సాగించింది. తిరు ఓనం నాడు డ్రైడే కావడంతో మద్యం దుకాణాలు మూసివేశారు. ‘అవిట్టం’ రోజున రూ.94.36 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.