ఓ వైపు కరోనా కేసులు..మరో వైపు చాప కింద నీరులా ఆ వ్యాధులు..

Karnataka: Dengue Cases Increases In Bengaluru - Sakshi

బనశంకరి(బెంగళూరు): ఓ వైపు కరోనా కేసులు జోరుగా పెరుగుతుండగా మరో వైపు డెంగీ జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్‌ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,838 డెంగీ కేసులు నమోదయ్యాయి. కానీ ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గత ఏడాదితో (జనవరి 1 నుంచి జూన్‌ 10) పోలిస్తే ఈ ఏడాది 50 శాతం డెంగీ కేసులు పెరిగాయి. బెంగళూరు నగరంలో 388 కేసులు, ఉడుపిలో 217, మైసూరులో 171, చిత్రదుర్గలో 105, కొప్పళలో 94 కేసులు నమోదయ్యాయి. 2021లో 916, (2022లో 1,838 జనవరి నుంచి జూన్‌ 10 వరకు) గత నెలలోనే 532 కేసులు నమోదయ్యాయి. 2021లో 2987 డెంగీ కేసులు నమోదయ్యాయి.

డెంగీ జ్వరాల కట్టడికి చర్యలు: డెంగీ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డెంగీ, చికున్‌గున్యా, జికా వైరస్‌ రోగానికి కారణమైన ఈడీస్‌ దోమల సంతానోత్పత్తి తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశా కార్యకర్తలు, ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామీణ, నగర ప్రాంతాల్లో ప్రజలను జాగృతం చేయాలని సూచించింది. పొడిచెత్తను త్వరితగతిన సేకరించాలని అన్ని జిల్లాల అంటురోగాల నియంత్రణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ప్రారంభం కాగానే ఈడీస్‌ దోమలు మురుగునీటిలో గుడ్లుపెట్టి సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి. ఈ దోమలు కుడితే డెంగీ జ్వరం వస్తుంది.

డెంగీ లక్షణాలు 
►  జ్వరం, తలనొప్పి, అలసట, జలుబు, గొంతునొప్పి, వాంతులు, కడుపునొప్పి, చేతులు కాళ్ల నొప్పులు, శరీరంపై గుల్లలు ఏర్పడటం   
డెంగీ నియంత్రణకు చర్యలు 
►  పగలు  దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి 
►  శుభ్రమైన నీటిని వేడిచేసి తాగాలి 
►  నీటితొట్టెలు, ట్యాంకులపై మూతలు ఉంచాలి 
►  పాత్రలు, బిందెల్లో  నీరు నిల్వ ఉంచరాదు 
►  ఇంటి చుట్టుపక్కల పిచ్చిమొక్కలు, మురుగు నీరు  నిల్వ  ఉండరాదు. చిప్పలు, టైర్లులాంటి చెత్తను తొలగించాలి   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top