విజయ్ గెలుపు వెనుక అసలు సిక్రెట్‌ ఏంటి? | Jagadish Palaniswami Is The Strategist Behind Tvk Vijay Success | Sakshi
Sakshi News home page

విజయ్ గెలుపు వెనుక అసలు సిక్రెట్‌ ఏంటి?

May 10 2026 7:41 AM | Updated on May 10 2026 11:00 AM

Jagadish Palaniswami Is The Strategist Behind Tvk Vijay Success

సాక్షి, చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్‌ తాజాగా తమిళగ వెట్రి కళగం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య శక్తిగా ఎదిగారు. ఈ అసాధారణ ఎదుగుదల వెనుక తెర వెనుక ఉండి చక్రం తిప్పిన వ్యూహకర్త, విజయ్‌ మేనేజర్‌ జగదీష్‌ పళనిస్వామి అన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది.  గత పదేళ్లుగా సినిమాలో విజయ్‌ బ్రాండ్‌ వాల్యూను పెంచడం నుండి, టీవీకే పార్టీ డిజిటల్‌ సామ్రాజ్యాన్ని నిర్మించడం వరకు జగదీష్‌ , ఆయన సంస్థ ది రూట్‌  పోషించిన పాత్ర ఇప్పుడు ఇతర రాజకీయ పారీ్టల దృష్టిని తమిళనాడులో ఆకర్షిస్తోంది.

విజయ్‌ రాజకీయ రంగప్రవేశం అనేది అనుకోకుండా జరిగింది కాదు. దీని కోసం జగదీష్‌ బృందం గత ఐదేళ్లుగా ఒక పక్కా ప్రణాళికతో పనిచేసిందన్నది టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ’ది రూట్‌’ కేవలం సినిమా మేనేజ్‌మెంట్‌ సంస్థగా కాకుండా, ఒక భారీ డేటా అనలిటిక్స్‌ సెంటర్‌గా పనిచేసిందంటున్నారు. ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో యువతను ఆకర్షించడానికి జగదీష్‌ ప్రత్యేక వ్యూహాలు రచించారని చెబుతున్నారు.

ఓ సాధారణ యువకుడు విజయ్‌కి సంబంధించిన చిన్న వీడియో చూసినా, మరుసటి నిమిషం నుండి అతని ఫీడ్‌ అంతా విజయ్‌ వార్తలతో నిండిపోయేలా అల్గారిథమ్‌ టెక్నిక్స్‌ను ఉపయోగించారని పేర్కొటున్నారు. సున్నా నుండి లక్షల వరకు ఫాలోవర్లు ఉన్న వేలకొద్దీ షాడో ఐడీల ద్వారా విజయ్‌ రాజకీయ భావజాలాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పవచ్చు.. ఇది ఒక కృత్రిమ  డిజైన్డ్‌ వేవ్‌ ను సృషించి, విజయ్‌ను ఒక తిరుగులేని నాయకుడిగా ప్రొజెక్ట్‌ చేసిందన్నది జగమెరిగిన సత్యం.

మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే వాట్సాప్‌ గ్రూపులను యాక్టివేట్‌ చేస్తాయి. కానీ, జగదీష్‌ బృందం గత ఐదేళ్లుగా ప్రతి నియోజకవర్గంలోని అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ బలమైన వాట్సాప్‌ నెట్‌వర్క్‌ను నిర్మించి ఉండడం విశేషం. ఏదైనా ఒక వార్త బయటకు వస్తే, అది కేవలం ఐదు నిమిషాల్లో తమిళనాడులోని లక్షలాది మంది యువత మొబైల్‌లకు చేరుకునేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్ది  ఉన్నారు. మొదట్లో సినిమా కంటెంట్‌కు పరిమితమైన ఈ గ్రూపులు, మెల్లమెల్లగా విజయ్‌ను ఒక కుటుంబ సభ్యుడిగా భావించేలా మార్చేశాయి.

రాజకీయాలంటే ఆసక్తి లేని యువతను సైతం ఆకర్షించేలా విజయ్‌ వేదికల మీద ఇచ్చే ప్రసంగాలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి, సినిమా ఎడిటింగ్‌ టెక్నిక్స్‌తో, మాస్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో రీల్స్‌గా మార్చి వైరల్‌ చేశారు. ఇది టీవీకే పార్టీని ఒక గ్లామరస్‌ , స్టైలిష్‌ పొలిటికల్‌ ఫోర్స్‌గా మార్చింది. విజయ్‌పై ఏవైనా విమర్శలు వస్తే వాటిని లాజికల్‌గా కాకుండా, భారీ డిజిటల్‌ అటాక్‌ ద్వారా అణిచివేసే పద్ధతిని వీరు అనుసరించడం ప్రత్యేకం.

ప్రత్యర్థి నటులు  లేదా పార్టీల ప్రతిష్టను తగ్గించేలా హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్‌ చేయడంలోనూ ఈ రూట్‌ టీమ్‌ సిద్ధహస్తులని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి, ఎంజీఆర్‌ కాలం నాటి ఇమేజ్‌ను నేటి డిజిటల్‌ యుగానికి అనుగుణంగా మార్చి, విజయ్‌ను ఒక సూపర్‌ పవర్‌ పొలిటికల్‌ లీడర్‌గా నిలబెట్టడంలో జగదీష్‌ పళనిస్వామి ’మాస్టర్‌ మైండ్‌’గా నిలిచారన్నది ఇప్పుడు తమిళనాట హాట్‌ టాపిక్‌గా మారింది.   

Advertisement
 
Advertisement
Advertisement