మిగ్‌ స్థానంలో తేజస్‌ | India Retires MiG-21 After 62 Years, Replaces With Indigenous Tejas Mk-1A | Sakshi
Sakshi News home page

మిగ్‌ స్థానంలో తేజస్‌

Jul 24 2025 5:00 AM | Updated on Jul 24 2025 5:00 AM

India Retires MiG-21 After 62 Years, Replaces With Indigenous Tejas Mk-1A

సెప్టెంబర్‌లో మిగ్‌–21కు వీడ్కోలు పలకనున్న వాయుసేన 

తేజస్‌ ఎంకే–1ఏ యుద్ధవిమానాలతో భర్తీ 

శత్రుసేనల గుండెల్లో భయం పుట్టిస్తూ, భారత వాయుసేనకు ఆరు దశాబ్దాలపాటు సేవలందించిన, ఘన చరిత గల మిగ్‌–21 యుద్ధవిమానాల స్థానంలో అధునాతన తేజస్‌ ఎంకే–1ఏ తేలికపాటి యుద్ధవిమానాలను విధుల్లోకి తీసుకోవాలని భారతవాయుసేన నిర్ణయించింది. సెప్టెంబర్‌లో మిగ్‌–21 యుద్ధవిమానాలకు వాయుసేన వీడ్కోలు పలకనుంది. సెప్టెంబర్‌ 19న చండీగఢ్‌లోని వైమానిక స్థావరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీటి సేవలకు లాంఛనంగా స్వస్తిపలకనున్నట్లు ఇప్పటికే వాయుసేన ఒక ప్రకటనలో పేర్కొంది. 

చండీగఢ్‌ ఎయిర్‌బేస్‌లోనూ మిగ్‌–21 యుద్ధవిమానాలు విధుల్లో ఉన్న విషయం విదితమే. ఇకమీదటా వీటి బాధ్యతలను తేజస్‌ తమ భుజస్కంధాలపై మోయనున్నాయి. అమెరికాలోని జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీఈ) ఎఫ్‌404 అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ అమర్చిన తేజస్‌ 4.5 తరం అధునాతన యుద్ధవిమానం. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న తేలికపాటి యుద్ధవిమానంగానూ ఇది రికార్డులకెక్కింది. ప్రస్తుతం రెండు మాత్రమే మిగ్‌–21 స్క్వాడ్రాన్‌లు విధుల్లో ఉన్నాయి. ఇందులో మొత్తంగా 36 మిగ్‌ విమానాలు ఉన్నాయి. రాజస్థాన్‌లోని నాల్‌ ఎయిర్‌బేస్‌లోనూ మిగ్‌–21 విమానాలు విధులు నిర్వర్తిస్తున్నాయి.  

1963లో మొదలైన మిగ్‌ ప్రస్థానం 
ఒక్కటే ఇంజిన్, ఒక్కటే పైలట్‌ సీటుతో రూపుదిద్దుకున్న బహుళ ప్రయోజన మిగ్‌–21 యుద్ధవిమానాలను భారతసైన్యం తొలిసారిగా 1963లో తమ దళాల్లోకి తీసుకుంది. భూతలం మీది లక్ష్యాలను చేధించేందుకు ప్రధానంగా దీనిని వినియోగించారు. నాటి సోవియట్‌ యూనియన్‌లోని మికోయన్‌–గురేవిచ్‌ డిజైన్‌ బ్యూరో(ఓకేబీ) దీని డిజైన్‌ను అభివృద్ధిచేసింది. 

1965లో ఇండో–పాకిస్తాన్‌ యుద్ధం, 1999 కార్గిల్‌ యుద్ధం, 1971లో బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధంలో మిగ్‌–21 యుద్ధవిమానాలు కీలకపాత్ర పోషించాయి. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన సర్జికల్‌ స్ట్రైక్‌లోనూ మిగ్‌ విమానాలు దాడులచేశాయి. గగనతలంలో శత్రువిమానాలతో పోరులో పాకిస్తాన్‌కు చెందిన అత్యంత అధునాతన ఎఫ్‌–16 యుద్ధవిమానాన్ని భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ఈ మిగ్‌–21 నడుపుతూనే బాంబులతో నేలకూల్చి మిగ్‌ సత్తాను చాటారు. దాంతో ఆనాడు మరోసారి మిగ్‌ల శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి.  

విమర్శలకూ కేంద్రబిందువుగా.. 
కీర్తితోపాటు అపకీర్తిని మిగ్‌ విమానాలు భారీగా మూటగట్టుకున్నాయి. ఎన్నో విమానాలు సాంకేతిక సమస్యలతో కుప్పకూలాయి. ఎంతో ప్రతిభావంతులైన పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పైలట్ల మరణాలతో వారి సతీమణులను వితంతువులుగా మార్చే క్రతువులో మిగ్‌లు బిజీగా మారాయని గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. గగనతలంలో విధి నిర్వహణలో ఇప్పటిదాకా ఏకంగా 500 మిగ్‌ విమానాలు కుప్పకూలినట్లు, 170 మందికిపైగా పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలే చెబతున్నాయి.  

ఆధునిక పంతాలో వాయుసేన 
కాలంచెల్లిన విమానాల స్థానంలో సమకాలీన అవసరాలు తీర్చే ఆధునిక సాంకేతికత దన్నుతో గగనతలాన్ని ఏలా కొత్త విమానాలను రంగంలోకి దింపాలని వాయుసేన గతంలోనే నిర్ణయించింది. అందులోభాగంగానే హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారీ తేలికపాటి యుద్ధవిమానం(ఎల్‌సీఏ) రకం తేజస్‌ను వాయుసేనలోకి తీసుకుంటున్నారు. 

ఇజ్రాయెల్‌ తయారీ ఈఎల్‌/ఎం 2025 ఏసా రాడార్, కొత్తతరం ఎల్రక్టానిక్‌ ఉపకరణాలు, జామర్, నేరుగా కనిపించంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం చేధించే సత్తాతో కొత్త విమానాన్ని వాయుసేన రంగంలోకి దింపుతోంది. పాతకాలంనాటి మెకానికల్‌ ఫ్లైట్‌ కంట్రోలర్‌లకు బదులుగా ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ఫేజ్‌ కంట్రోల్‌ కంప్యూటర్‌ సదుపాయాలు తేజస్‌లో ఉన్నాయి. మొత్తంగా తొమ్మిది వేర్వేరు రకాలైన ఆయుధాలను ఇది ప్రయోగించగలదు. ఇజ్రాయెల్‌ తయారీ డెర్బీ క్షిపణులతోపాటు దేశీయంగా తయారైన అస్త్ర మిస్సైల్‌ను తేజస్‌ సునాయసంగా ప్రయోగించగలదు. దీనికి రిపేర్లు చేయడం కూడా చాలా సులువు. గగనతల రక్షణతోపాటు నిఘా, దాడి వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. 

48వేల కోట్ల డీల్‌ 
తేజస్‌ ఎంకే–1ఏ రకం 83 విమానాలను తయారుచేసి సరఫరాచేసేందుకు హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ రూ.48,000 కోట్ల ఒప్పందాన్ని 2021 ఫిబ్రవరిలోనే కుదుర్చుకుంది. ఇవిగాక మరో 97 యుద్దవిమానాల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ. 67,000 కోట్లు ఖర్చుచేసేందుకు సిద్ధపడింది. అయితే తేజస్‌లో అమర్చేందుకు కావాల్సిన జీఈ ఎఫ్‌404 రకం 99 ఇంజిన్ల కొనుగోలు కోసం అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్‌తో హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ రూ.5,375 కోట్ల విలువైన ఒక ఒప్పందాన్ని 2021 ఆగస్ట్‌లోనే కుదుర్చుకుంది. ఏడాది ఆలస్యంగా ఇవి సంస్థకు అందాయి. తొలి దశలో 12 తేజస్‌ విమానాలను వాయుసేనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విదేశీ ఇంజిన్‌ను చెక్‌చేసి, ప్రధాన బాడీకి బిగించి, మళ్లీ తనిఖీచేయడం సుదీర్ఘప్రక్రియ. అందుకే తేజస్‌ల తుది డెలివరీ ఆలస్యమవుతోంది.  
– సాక్షి, నేషనల్‌డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement