
2021తో పోలిస్తే 2025లో 90 శాతం పెరుగుదల
టాప్ – 3 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు
టాప్–10 స్టేట్స్, సిటీస్‌లో తెలంగాణ, హైదరాబాద్
2,900 మందితో 14వ స్థానంలో నిలిచిన విశాఖపట్నం
దేశంలో మిలియనీర్ కుటుంబాల (ఒక మిలియన్ డాలర్లు లేదా రూ.8.5 కోట్ల నికర విలువ ఉన్నవి) సంఖ్య కేవలం 4 ఏళ్లలో 90 శాతం పెరిగింది. 2021లో వీటి సంఖ్య 4,58,000 లక్షల నుంచి 2025లో ఏకంగా 8,71,700కు ఎగబాకింది. 2017– 2025 మధ్య మిలియనీర్ కుటుంబాల సంఖ్య ఏకంగా 445 శాతం పెరగడం విశేషం.
దేశంలోని మొత్తం కుటుంబాల్లో.. ఇవి 0.31 శాతం. రాష్ట్రాల్లో మహారాష్ట్ర అత్యధిక మిలియనీర్ కుటుంబాలతో నంబర్ వన్ స్థానంలో ఉంటే.. నగరాల్లో ముంబై టాప్‌లో నిలిచింది. ఇలాంటి ఆసక్తికర విషయాలు ‘మెర్సిడెజ్ బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025’లో వెల్లడయ్యాయి.- సాక్షి, స్పెషల్ డెస్క్
ప్రధాన కారణాలు
పట్టణ ఆర్థిక వృద్ధి, వ్యాపార ఆలోచనలు పెరగడం, బలమైన ఈక్విటీ మార్కెట్లు, టెక్నాలజీ, వివిధ రకాల పెట్టుబడి మార్గాలు వంటి అనేక కారణాలు మిలియనీర్ కుటుంబాలు పెరగడానికి దోహదం చేశాయి.

మరింత ధనికులుగా..
2017 నాటి మిలియనీర్లలో 2025 నాటికి రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరినవారు 5 శాతం అంటే 66,800 కుటుంబాలు. రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది 1.3 శాతం. రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి చేరింది 0.07 శాతం. రూ.8,500 కోట్ల క్లబ్ అంటే బిలియనీర్ల జాబితాలోకి చేరింది 0.01 శాతం.. అంటే 360 కుటుంబాలు.
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ..
మిలియనీర్ కుటుంబాలు అంటే గతంలో ముంబై, ఢిల్లీ వంటి ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఉండేవి. కానీ, ఇప్పుడు అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం, జైపూర్, లక్నో వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఈ సంఖ్య పెరుగుతోంది.
ఆర్థిక స్వేచ్ఛ
‘మెర్సిడెజ్ బెంజ్ హురున్ ఇండియా లగ్జరీ కంజ్యూమర్ సర్వే’ ప్రకారం.. ఏటా పర్యటనలు, చదువు, వినోదం కోసం 60 శాతం మిలియనీర్ కుటుంబాలు
రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నాయి.
⇒ ‘ఎంత సంపద ఉంటే ఆర్థిక స్వేచ్ఛ’ ఉన్నట్టు భావిస్తారు అని అడిగితే.. 27 శాతం మంది రూ.50 కోట్లు చాలు అని చెప్పారు. రూ.200 కోట్లు ఉండాల్సిందే అని 20 శాతం మంది స్పష్టం చేశారు.
⇒ 40 శాతం మంది ఒక కారును 6 ఏళ్లకుపైనే వాడుతున్నారు.
⇒ 27 శాతం మంది.. యోగా తమకు ఇష్టమైన ఫిట్‌నెస్ కార్యక్రమం అని చెప్పారు.
⇒ విదేశాల్లో చదువుల విషయానికొస్తే.. అమెరికా (19 శాతం మంది), యూకే (14 శాతం) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
⇒ ఆసక్తికరంగా 42 శాతం మంది తమ పిల్లలను భారతదేశంలోనే చదివిస్తామని వెల్లడించారు.