కిక్కిరిసిన కేదార్‌నాథ్‌  | Huge crowds of devotees flock to Kedarnath Dham | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన కేదార్‌నాథ్‌ 

May 25 2026 6:33 AM | Updated on May 25 2026 6:33 AM

Huge crowds of devotees flock to Kedarnath Dham

తొలిసారిగా ఏకబిగిన 22 గంటలపాటు దర్శనాలు 

రోజుకు 30 వేల మంది రాక..దర్శనానికి 11 గంటలు 

నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు...కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌కు మునుపెన్నడూ లేనివిధంగా భక్తులు తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే 8 లక్షల మంది ఆలయాన్ని సందర్శించుకున్నారు. 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి రోజుకు 25 వేల నుంచి 30 వేల మంది భక్తులు వస్తున్నారు. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో కనీసం 11 గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. 

రద్దీ కారణంగా గర్భగుడిలోకి వెళ్లిన భక్తులకు ఒకటి, ఒకటిన్నర సెకన్లకు మించి నిలిచే అవకాశం దక్కడం లేదు. నిమిషానికి 45 మంది భక్తులు దర్శనం చేసుకునేలా ఆలయసిబ్బంది రద్దీని నియంత్రిస్తున్నారు. గతంలో ఆలయాన్ని రోజులో 16 నుంచి 18 గంటలు మాత్రమే తెరిచి ఉంచేవారు. కానీ, ఈసారి వారాంతపు రద్దీ హద్దులు దాటడంతో మొట్టమొదటిసారిగా రోజుకు ఏకబిగిన 22 గంటల పాటు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం 4 గంటలకే ప్రారంభమవుతున్న భక్తుల దర్శనాలు అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా సాగుతున్నాయి.

 చార్‌ధామ్‌కు భక్తుల తాకిడితో రహదారులు స్తంభించిపోతున్నాయి. గుప్తకాశీ నుంచి సోన్‌ప్రయాగ్‌ మధ్య ఉన్న 27 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి వాహనాలకు ఏకంగా 6 గంటల వరకు సమయం పడుతోంది. హెలికాప్టర్‌ టిక్కెట్లు ఉన్నప్పటికీ, ప్రయాణికులు వెళ్లడానికి, తిరిగి రావడానికి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిల స్లాట్లు పూర్తిగా నిండిపోవడంతో, రిషికేశ్‌లో ఆఫ్‌లైన్‌ రిజిస్ట్రేషన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. 

భోగ్‌ సమయం కుదింపు... 
భక్తుల రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం వేళ కేదార్‌నాథ్‌లో ‘బాల భోగ్‌’సమయాన్ని తగ్గించారు. గతంలో ఎక్కువ సమయం తీసుకునే ఈ ప్రక్రియను ఇప్పుడు కేవలం అరగంటకే పరిమితం చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకున్న ప్రత్యేక పూజలను రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల మధ్య కానించేస్తున్నారు. 

నిపుణుల హెచ్చరిక 
‘సున్నితమైన హిమాలయ పర్యావరణం ఇంతటి భారీ రద్దీని తట్టుకోలేదు. కేదార్‌నాథ్‌ భౌగోళిక నిర్మాణానికి రోజుకు 30 వేల మందిని మోసే సామర్థ్యాన్ని కలిగి లేదు. 2013 నాటి ఘోర విపత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వం ఇప్పటికైనా రోజువారీ భక్తుల సంఖ్యపై పరిమితి విధించకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశముంది’అని హెచ్‌.ఎన్‌.బి గఢ్వా ల్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూగర్భ శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement