ఈసారి తెలంగాణ, ఏపీలో లోటు వర్షపాతం నమోదయ్యే చాన్స్
కరువు పరిస్థితులు, తాగునీటి కొరత మరింత పెరిగే ప్రమాదం
సన్నద్ధత చర్యలు చేపట్టాలని భారత వాతావరణ శాఖ అంచనా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జూన్‌లోనూ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అంచనా వేసింది. ఏపీతోపాటు యూపీ, హరియాణా, పంజాబ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లలో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
‘మధ్య, వాయవ్య, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా ఎక్కువగా ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం చాలా వరకు సాధారణంకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది’అని ఐఎండీ డీజీఎం మృత్యుంజయ్ మొహాపాత్ర శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నిరంతరం అధిక ఉష్ణోగ్రతల వల్ల మౌలిక సదుపాయాలు, వనరుల నిర్వహణ వ్యవస్థలపై అదనపు భారం పడే అవకాశాలున్నాయని, ఈ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు అవసరమైన సన్నద్ధతా చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లోటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. ఈ పరిస్థితుల వల్ల ప్రజారోగ్యం, నీటి లభ్యత, విద్యుత్ వినియోగం, నిత్యావసర సేవలపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
దేశంలో ఈసారి వర్షాలు తక్కువే..
దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రుతుపవనాల వర్షపాత దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉందని.. ఇది ఏప్రిల్‌లో అంచనా వేసిన 92 శాతం కంటే కూడా తక్కువని తాజా అంచనాలో పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడటంతో మధ్యభారత్ సహా దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, దేశ వాయవ్య ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.\
అదే సమయంలో ఈశాన్య భారత్‌లో మాత్రం సాధారణ స్థాయిలో, వాయవ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ద్వీపకల్ప ప్రాంతాలు, తూర్పు–మధ్యభారత్‌ను ఆనుకొని ఉన్న ప్రాంతాలు, తూర్పు భారత్‌లోని కొన్నిచోట్ల సాధారణం నుంచి అధిక వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం!: దేశంలోని ప్రధాన వర్షాధార వ్యవసాయ ప్రాంతాలను కలిగిన ‘మాన్సూన్ కోర్ జోన్’లోనూ ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.
దీంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని అంచనా వేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయం, తాగునీటి లభ్యత, జలవిద్యుత్ ఉత్పత్తి, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించింది. కరువు పరిస్థితులు, తాగునీటి కొరత వంటి సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది.
వడదెబ్బతో 10 మంది మృతి
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో 10 మంది మృతి చెందారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఎర్రగుంటపల్లిలో మేస్త్రీ ఇంజపురి కనకయ్య (48), గంగిపల్లిలో రాచర్ల సంపత్ (55), మానాలలో ఉపాధి కూలీ ఎడిపెల్లి గంగారెడ్డి (60). పాపక్కపల్లిలో సామన్ వీరన్న (68), మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాలో బోడ భిక్రి (63), పెనుగొండలో సందా ఉపేందర్ (46), మర్రిమిట్టలో గుండమల్ల లచ్చమ్మ (68), జయశంకర్ భూపాలపల్లి జిల్లా అశిరెడ్డిపల్లిలో జెట్టి వీరమ్మ (104), హనుమకొండలోని లక్ష్మీపురంలో జనగాని అమృత (76), సంగారెడ్డి జిల్లా దెగుల్‌వాడిలో గ్రామ పంచాయతీ కారి్మకురాలు సంగీత (40) వడదెబ్బతో మృతి చెందారు.


