వీడియో: గుజరాత్‌ సీఎం ప్రసంగిస్తుండగా ఆఫీసర్‌ కునుకు.. ఆ కమిట్‌మెంట్‌కు ఫలితంగా..

Gujarat Officer Suspended For Sleeping At CM Event - Sakshi

గాంధీనగర్‌: స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొని, ప్రసంగిస్తున్న సభలో కునుకు తీశాడు ఆ అధికారి. అయితే మామూలుగా అయితే విషయం ఎవరూ పట్టించుకునేవాళ్లు కారేమో. పాపం.. కెమెరా కళ్లన్నీ ఆయన మీదే పడ్డాయి. లోకల్‌ మీడియాలో పదే పదే ఆ దృశ్యాలు టెలికాస్ట్‌ అయ్యాయి. ఫలితంగా.. ఆయనపై కమిట్‌మెంట్‌ను ప్రశ్నిస్తూ సస్పెన్షన్‌ వేటు వేసింది అక్కడి ప్రభుత్వం. 

గుజరాత్‌ రాష్ట్ర ముఖ్యమంత్ భూపేంద్ర పటేల్‌ పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీశారన్న కారణంగా ఓ అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. శనివారం భుజ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ అధికారిని భుజ్‌ మున్సిపాలిటీ చీఫ్‌ ఆఫీసర్‌ జిగర్‌ పటేల్‌గా గుర్తించారు.  

కచ్‌ జిల్లాలో.. 2001 నాటి గుజరాత్‌ భూకంప బాధితులకు పునరావాసంలో భాగంగా 14 వేల ఇళ్ల పట్టాలను సీఎం భూపేంద్ర పటేల్‌ అందించారు. అయితే.. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా..  ముందు వరుసల్లో కూర్చున్న జిగర్‌ పటేల్‌ కునుకు తీస్తూ కెమెరాలకు చిక్కారు. ఆ వీడియో విపరీతంగా మీడియా, సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ అయ్యింది. దీంతో గంటల వ్యవధిలోనే ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ. 

విధి పట్ల నిబద్ధతా లోపం, పైగా ఆయన ప్రవర్తన నిర్లక్ష్యపూరితంగా ఉందన్న విషయం.. వీడియోల ఆధారంగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అందుకే గుజరాత్‌ సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌ 1971, రూల్‌ 5(1)(a) ప్రకారం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మనీష్‌ షా. మరోవైపు వేటుపై ఆ అధికారి స్పందన కోసం మీడియా యత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

Video Credits: VtvGujarati
 

ఇదీ చదవండి:  అవును, శివుని కంఠంపై సర్పాన్ని: మోదీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top