Sakshi News home page

‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి

Published Tue, Jun 13 2023 5:41 AM

Ground floor of Ram Temple in Ayodhya in final stages of construction - Sakshi

న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మిస్తుండగా తొలి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ వివరాలను ఆలయ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ ఈ ఏడాది అక్టోబర్‌కల్లా గ్రౌండ్‌ఫ్లోర్‌ నిర్మాణం పూర్తి అవుతుంది. నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా స్వయంగా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

నిర్మాణ పనులపై తాజా సమీక్షా సమావేశంలో నిర్మాణసంస్థలు లార్సెన్‌ అండ్‌ టూబ్రో, టాటా కన్సల్టింగ్‌ ఇంజనీర్స్‌ వారి నిపుణులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజువారీగా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. గర్భగుడితో ఉన్న ప్రధాన ఆలయంతోపాటు నృత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఇలా ఐదు మండపాలనూ నిర్మిస్తున్నారు. ఐదు మండపాలపై 34 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు ఉండే గుమ్మటాలను ఏర్పాటుచేస్తారు.

ఇవి భక్తులకు ఆలయం ప్రాంగణం నుంచి 69 అడుగుల నుంచి 111 అడుగుల ఎత్తుల్లో గోచరిస్తాయి. ప్రధాన ఆలయం పొడవు 380 అడుగులుకాగా, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం గర్భగుడి నిర్మాణంలో మక్రానా మార్బుల్‌తో చెక్కిన స్తంభాలు, పైకప్పు, కుడ్యాలను వినియోగించనున్నారు.

ఆలయ బరువు, అన్ని రకాల వాతావరణ మార్పులను తట్టుకునేలా మొత్తంగా 392 భారీ స్తంభాలను ప్రధాన ఆలయం కోసం వాడుతున్నారు. గర్భగుడి ద్వారాలకు బంగారు పూత పూయనున్నారు. ఆలయ ప్రాకారంతో కలిపి రామాలయ విస్తీర్ణం 8.64 ఎకరాలు. ఆలయ ప్రాకారం పొడవు 762 మీటర్లుకాగా లోపలి ప్రాంగణంలో మొత్తం ఆరు ఆలయాలు నిర్మిస్తారు. భక్తుల కోసం విడిగా సదుపాయం కల్పిస్తారు’ అని ఆ ప్రకటన పేర్కొంది.

Advertisement
Advertisement