
పట్నా: పెళ్లి మండపం నుంచి పెళ్లి కుమారుడు కిడ్నాప్ కావడం ఎక్కడైనా విన్నామా? బిహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలోని దిఘ్వా దబౌలీ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పెళ్లి వేడుక కాస్తా రణరంగంగా మారిపోయింది. పెళ్లిలో అతిథులను అలరించడానికి వచ్చిన డ్యాన్సర్ల బృందం పెళ్లి కొడుకు సోనూకుమార్ శర్మను అపహరించింది. తొమ్మిది గంటల తర్వాత అతడి ఆచూకీ దొరకడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగిందంటే... పెళ్లి సమయంలో డ్యాన్సర్ల బృందం పలు రకాల నృత్యాలతో అలరించింది. అప్పటికే సమయం మించిపోవడంతో తాము కార్యక్రమం ఆపేస్తామని డ్యాన్సర్లు చెప్పడంతో అతిథులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాన్సులు కొనసాగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దానికి డ్యాన్సర్లు ఒప్పుకోలేదు. దాంతో ఇరువర్గాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ముస్కాన్ కిన్నార్ అనే కళాకారుడు గాయపడ్డాడు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకొని మళ్లీ వివాహ మండపానికి చేరుకున్నాడు.
ఆ సమయంలో పెళ్లికొడుకు సోనూకుమార్ శర్మ మండపంలోనే ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో డ్యాన్సర్ల బృందం పెళ్లి కుమారుడిని అపహరించింది. అందరూ చూస్తుండగానే వాహనంలో ఎక్కించి, అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. వరుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వరుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. తొమ్మిది గంటల తర్వాత సివాన్ జిల్లాలో అతడి అచూకీ కనిపెట్టారు. కిడ్నాప్ చేసిన డ్యాన్సర్ల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, డ్యాన్సర్లకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో ఘర్షణ జరిగిందని గోపాల్‌గంజ్ ఎస్పీ అవదేశ్ దీక్షిత్ చెప్పారు.