
వాష్ రూముల్లోకాసేపు సేదతీరుతున్న జెన్ –జీ
ఒత్తిడిని జయించేందుకు‘బాత్రూమ్ క్యాంపింగ్’
కొత్త ఆలోచనల కోసమూఅటువైపే అడుగులు
ప్రపంచవ్యాప్తంగాట్రెండ్‌గా మారుతున్న వైనం
సాక్షి, స్పెషల్ డెస్క్: ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు జీవితంలో ప్రతి ఒక్కరికీ వారివారి స్థాయిలను బట్టి ఒత్తిడి అనేది అనివార్యం అయిపోయింది. సాధారణంగా ఒత్తిడిని జయించేందుకు యోగా, క్రీడలు, సంగీతం, నలుగురితో ముచ్చటించడం, షాపింగ్ థెరపీ వంటివి చేస్తుంటారు. కానీ జెన్ –జీ.. అంటే 13–28 ఏళ్ల వయసున్న యువతలో మాత్రం చాలామంది వీటన్నిటికీ భిన్నంగా ‘బాత్రూమ్ క్యాంపింగ్’ని ఆశ్రయిస్తున్నారు.
టెంట్, చలి మంటలు, నక్షత్రాలతో మెరిసే ఆకాశం, షాపింగ్.. ఇవేవీ కావు. జస్ట్ తెల్లటి టైల్స్ పరిచిన నాలుగు గోడల మధ్య ‘రెస్ట్‌రూమ్స్’లో జెన్ –జీ సేదతీరుతోంది. శారీరక అవసరాల కోసం కాకుండా మానసిక ప్రశాంతతకు బాత్రూమ్‌లో ఎక్కువసేపు గడుపుతున్నారు. శబ్దాలు, జనంతో కిటకిటలాడే ప్రదేశాలకు దూరంగా ప్రశాంతంగా ఉండటానికి, సంగీతం వినడానికి మూసి ఉంచిన కమోడ్‌పై కూర్చుని మనసుని తేలికపర్చుకుంటున్నారు.
ఒత్తిడి, ఆందోళన, బాధ, ఓటమి సమయంలోనే కాదు.. సమస్యల నుంచి బయటపడే మార్గాల అన్వేషణ, కొత్త ఆలోచనల కోసమూ అటువైపే అడుగులు పడుతున్నాయి. ఇల్లు, ఆఫీస్ లేదా ఏదైనా పార్టీలో ఉన్నా.. ఒత్తిడికి గురైనప్పుడు, మనసు బాధగా ఉన్నప్పుడు బాత్రూమ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ఇప్పుడు ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అంటున్నారు.
ప్రపంచానికి దూరంగా..
‘నా బాధ, ఒత్తిడి నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు. అవి వారికి అక్కరలేదు.అందరికీ కనపడేలా కూర్చుని బాధపడుతుంటే ఈ సమాజం వేలెత్తి చూపుతుంది. అలా కాకుండా బాత్రూమ్‌లో అయితే ఎవ్వరికీ తెలీదు. ఏకాంతం, నిశ్శబ్దంతో కూడిన ప్రశాంత వాతావరణమూ ఉంటుంది. మనల్ని జడ్జ్ చేసే అవకాశంఇంకొకరికి ఉండదు’అంటోంది జెన్ జీ.
బాత్రూమ్ క్యాంపింగ్ ఎందుకంటే?
ఒత్తిడి
ఆందోళన
కోపం
బాధ
ఓటమి
సమస్యకు పరిష్కారం
కొత్త ఆలోచనలు
వీటిని ట్రై చేయండి
ఒత్తిడి నుంచి ఉపశమనానికి బాత్రూమ్‌ను ఒక సౌలభ్యమైన స్థలంగాఈ తరం వాళ్లు భావిస్తూ ఉండవచ్చు. కానీ బాత్రూమ్ అంటే రోగకారక క్రిములకు అడ్డా అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆందోళనను నియంత్రించడానికి ఇతర ఆరోగ్యకరమార్గాలూ ఉన్నాయని వారు సూచిస్తున్నారు.
ప్రాణాయామం: శ్వాస ఆధారిత ప్రాణాయామ ప్రక్రియలను నిపుణుల ద్వారా తెలుసుకుని రోజూ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మెదడు చురుగ్గా పనిచేస్తుందనిప్రపంచ వ్యాప్తంగా అనేకఅధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రకృతి ఒడిలో: ప్రకృతిని మించిన వైద్యుడు లేడు. పార్కులు, మైదానాల్లో గడ్డిని తాకడం, గడ్డిపై పడుకోవడం, సుందర ప్రకృతిదృశ్యాలను ఆస్వాదించడం.. ఇవన్నీ మనసును ఆహ్లాదపరిచేవే.
సంగీతం,పజిల్స్: నచ్చిన సంగీతాన్ని వినొచ్చు. మెదడుకు పని కల్పించే పజిల్స్ చేయొచ్చు.
ఆఫీసుల్లో: గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోకుండా.. ప్రతీ అరగంట లేదా గంటకు చిన్న విరామం తీసుకోవాలి. ఒత్తిడి అనిపిస్తే.. తేలికపాటి ప్రాణాయామాలు చేయాలి. మీ డెస్క్ వద్ద సరైనభంగిమలో కూర్చునేలా చూసుకోండి.
నో సెల్‌ఫోన్: అలసిపోయినట్టు అనిపించినా.. పని ఎక్కువైనట్టు అనుకున్నా వెంటనే చేతులు ఫోన్ మీదకు వెళ్లిపోతుంటాయి. అలా వెళ్లి.. ఎన్ని ఫేస్‌బుక్ పోస్టులు చూస్తామో / పెడతారో, ఎన్ని రీల్స్ చూస్తారో తెలీదు. అన్నీ మనకు నచ్చినవే ఉండాలని లేదుగా. నచ్చనివి కనిపిస్తే మరింత కోపం, ఒత్తిడి. అందువల్ల ఆందోళన ఉండే సమయాల్లో సెల్‌ఫోన్‌ను (మ్యూజిక్ వినేటప్పుడు తప్ప) పక్కన పెట్టేయండి.
సమయానికి తిండి, నిద్ర
» సమయానికి ఆహారం తీసుకోవాలి. ఎంత పనిలో ఉన్నా, ఒత్తిడి ఉన్నా.. తినే టైమ్‌ను మాత్రం వాయిదా వేయొద్దు. అది మరింత ఒత్తిడి,ఆందోళనకు దారితీస్తుంది.
» తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలూఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పోషకాహార నిపుణులు సూచించే.. ఒత్తిడి తగ్గించే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
» రాత్రుళ్లు సమయానికి, వేగంగా నిద్రపోవడం.. తెల్లవారుజామున లేవడం దినచర్యగా పెట్టుకోండి. రాత్రిపూట ఫోన్ లేదా టీవీల్లో సినిమాలు చూడటం సరదాగానేఉంటుంది గానీ.. దాని ప్రభావం మరుసటి రోజంతా పడుతుంది.
పని.. ఒత్తిడి కాదు!
జెన్–జీలో చాలామంది పనిని ఒత్తిడిగా భావిస్తుంటారు. ఆ మానసిక స్వభావాన్ని ముందు పూర్తిగా మార్చుకోవాలి. కెరీర్‌లో ఎదగాలన్న మనస్తత్వాన్ని పెంపొందించుకుంటే పనిపట్ల ప్రేమ, నిబద్ధత వాటంతట అవే పెరుగుతాయి. పనిలో లేదా కెరీర్‌లో వచ్చే సవాళ్లను భవిష్యత్తుకు మెట్లుగా చూడాలి తప్ప.. వాటిని ఒత్తిడిగా భావించినంత కాలం ఎదుగుదల ఉండదు అని గ్రహించాలి.