సీనియర్‌ సిటిజెమ్స్‌..! అరవైలోనూ ఇరవైని తలపించేలా | Old Doesn’t Mean Frumpy Emerging trends for seniors | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సిటిజెమ్స్‌..! అరవైలోనూ ఇరవైని తలపించేలా

Aug 26 2025 11:09 AM | Updated on Aug 26 2025 1:15 PM

Old Doesn’t Mean Frumpy Emerging trends for seniors

కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు మహా కవి శ్రీశ్రీ.. దీనికి భిన్నంగా ఈ వృద్ధులు ఎప్పటికీ యువకులే.. అన్నట్లు కొందరు నగరవాసులు వయసును లెక్కజేయకుండా అన్నింటా మేము సైతం అన్నట్లు నేటి యువతకు చాలెంజ్‌ విసురుతున్నారు. అరవైల్లోనూ ఇరవైని తలపించే రీతిలో విభిన్న పోటీల్లో భాగస్వాములవుతూ ఉత్సాహంగా ఆటల నుంచి అందాల పోటీల వరకూ పాలుపంచుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతూ ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ ఏ నంబర్‌ అంటున్నారు నాటి తరం సీనియర్‌ సిటి‘జెమ్స్‌’. రిటైర్మెంట్‌ అనంతరం కృష్ణా.. రామా.. అంటూ మూలన కూర్చోక.. ఎంచక్కా టూర్లు, ట్రెక్కింగ్స్‌ అంటూ తమకు నచి్చన రంగంలో సమయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు.   

కొండాపూర్‌లో నివసించే బాబూ రాజేంద్రప్రసాద్‌ రెడ్డికి 70 ఏళ్లు.. అనితరసాధ్యమైన రీతిలో 12వేల అడుగుల ఎత్తుకు ట్రెక్కింగ్‌ చేశారు. 72 ఏళ్ల వయసులోనూ ఎన్‌ఎమ్‌డీసీ ఫుల్‌ మారథాన్‌ అంటే 42.2 కి.మీ పరుగును పూర్తిచేశారు మరో నగరవాసి నాగభూషణరావు. ఇంకా మరిన్ని మారథాన్‌లలో భాగస్వామ్యం అవుతానంటున్నారు. 

పోరాట కళల్లో రాణిస్తూ మార్షల్‌ ఆర్ట్స్‌లో గిన్నిస్‌ రికార్డ్‌ సాధించారు మరో నగరవాసి కిరణ్‌ ఉనియాల్‌ (53).. ఇలా వయసుతో ప్రమేయం లేని విజయాలతో ఓల్డేజ్‌ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇస్తూ.. తమ రొటీన్‌ లైఫ్‌ని కొత్తగా మార్చేస్తున్నారు. అలాంటి సీనియర్ల హుషారు సరికొత్త యువ తరాన్ని ఆవిష్కరిస్తూ.. కొత్త కొత్త పోటీలకు ఊపునిస్తోంది. 

అప్పుడే అసలైన జీవితం.. 
రిటైర్మెంట్‌ వయసు దగ్గర పడుతోంది అంటే ఊళ్లు తిరుగుతూ తీర్ధయాత్రలతోనో, ఒళ్లు నలగని పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలతోనో, మనవళ్లతోనో.. పార్కుల్లో స్నేహితులతో ముచ్చట్లతోనో కాలం వెళ్లదీసే రోజులు కావివి అంటున్నారు నేటి తరం సీనియర్‌ సిటిజన్స్‌. ఓ వైపు ఉద్యోగమో, వ్యాపారమో.. కెరీర్‌ ముగుస్తుండగానే.. మరోవైపు కొత్త లక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి. ‘నిజం చెప్పాలంటే ఓ వ్యక్తిగా మనకేం కావాలి.. మనమేం చేయగలం.. అనే ఆలోచనలతో అప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది’ అని చెబుతున్నారు నగరానికి చెందిన సాహిల్‌ గులాటి(65). 

టాలెంట్, ఆసక్తి ఉండాలేగానీ.. 
ఇటీవల ఖ్యాల్స్‌ (కేహెచ్‌వైఏఏఎల్స్‌) అనే ఏజ్‌టెక్‌ స్టార్టప్, ‘50 ఎబవ్‌’ అనే పేరుతో టాలెంట్‌ హంట్‌ పోటీలు ప్రారంభించింది. ఇది 50 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేకించింది. గానం, ఫొటోగ్రఫీ, వంటలో ప్రావీణ్యం, కవితలు రాయడం, నటన.. ఇలా అదీ ఇదీ అని లేకుండా దాదాపు అన్ని విభాగాలనూ కలుపుకుని ఏకంగా 50 విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తుండడం విశేషం. 

కళా ప్రతిభ, ట్రావెల్, లైఫ్‌స్టైల్‌ వంటి విభాగాల్లో సత్తా ప్రదర్శించే అవకాశం కలి్పస్తోంది.. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పోటీ కోసం 20 నగరాల్లో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారు. వయసు సంబంధిత స్టీరియో టైప్‌ పోటీలకు భిన్నంగా వయోజనుల్లో పోటీ తత్వాన్ని, ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 

ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అందం వయసెరగదు అంటున్నారు మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ సీనియర్‌ ఫ్యాషన్‌ పేజెంట్‌ ఇండియా నిర్వాహకులు రేఖా దేశాయ్‌. గత మే నెల్లో 55 ఏళ్లు దాటిన వారి కోసం ఓ పోటీని కొత్తగా ప్రారంభించారామె. స్వయంగా ఆరు పదుల వయసులో ఉన్న రేఖా దేశాయ్‌.. ‘కలలకు ఎక్స్‌పైరీ డేట్‌ లేదు. సీనియర్స్‌ కళ్లలో మెరుపులు చూడడమే నా కార్యక్రమ లక్ష్యం’ అంటున్నారు. వీరి సంస్థ నిర్వహించే పీచ్‌ ఈవెంట్స్‌ తమ మొదటి సీజన్‌ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. 

ఆటలకు, పాటలకు సై..
సీనియర్స్‌ కోసం నిర్వహించే ఆటల పోటీలకూ కొదవలేదు. ఈత, గోల్ఫ్‌ నడక వంటి వాటిలోనూ పోటీలు జరుగుతున్నాయి. అలాగే బోస్, కార్న్‌హోల్, క్రికెట్‌ వంటి ఆటలు కూడా అందుబాటులో ఉన్నాయి. అస్సోంకు చెందిన 70ఏళ్ల ఖిరాదా సైకియా కలిత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ గత జూన్‌లో ధర్మశాలలో జరిగిన నేషనల్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో నాలుగు బంగారు పతకాలు గెలుచుకోవడం ఎందరికో స్ఫూర్తిని అందించింది. 

అదే విధంగా 60 ఏళ్ల పైబడిన వారి కోసం నిర్వహించే మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌ షిప్స్, ఏవీటీ చాంపియన్‌ టూర్స్, పాన్‌ ఇండియా ఫెడరేషన్‌ కప్‌ వంటి ఆటల పోటీల్లోనూ నగరవాసులు చురుకుగా పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు.  

( చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement