యస్‌.. ఇది ప్రతీకార హత్యే!: సింగర్‌ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు

Gangster Lawrence Bishnoi Confess His Gang Killed Sidhu Moose Wala - Sakshi

ఛండీగఢ్‌: పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌..  ఇదొక ప్రతీకార హత్యే అని వెల్లడించినట్లు తెలుస్తోంది.  

పంజాబీ సింగర్‌సిద్ధూ మూసే వాలా హత్యను తన ముఠా సభ్యులే చేశారని విచారణలో బిష్ణోయ్‌, పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. నిన్నటిదాకా(గురువారం) అసలు తనకు హత్యతో సంబంధం లేదని వాదిస్తూ వచ్చాడు బిష్ణోయ్‌. ఈ క్రమంలో తాజాగా..  విక్కీ మిద్దుఖేరా తన అన్న అని, అతని హత్యకు ప్రతీకారంగానే ఇప్పుడు సిద్ధూని తన ముఠా మట్టుబెట్టి ఉంటుందని బిష్ణోయ్‌ పోలీసులతో వెల్లడించినట్లు సమాచారం. 

అయితే ఈ హత్యలో తన ప్రమేయం లేదని, తీహార్‌ జైల్లో ఉన్న తాను కనీసం తన ఫోన్‌ను కూడా ఉపయోగించడం లేదని బిష్ణోయ్‌ వెల్లడించాడు. అంతేకాదు సిద్ధూ హత్యను జైలులోని టీవీ ద్వారానే తెలుసుకున్నా అని బిష్ణోయ్‌ తెలిపాడు.  

ఇదిలా ఉంటే పంజాబీ పాపులర్‌ సింగర్‌ సిద్ధూ.. మే 29న మాన్సా జిల్లాలో ఘోరంగా హత్యకు గురయ్యాడు. ఆ వెంటనే పోలీసుల అనుమానం లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ మీదకు మళ్లింది. ఆ మరుసటి రోజే.. జైల్లో తనకు భద్రత కల్పించాలంటూ పటియాలా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు లారెన్స్‌ బిష్ణోయ్‌. 

సింగర్‌ సిద్దూ హత్యలో కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ ప్రమేయం ఉందని తేలింది. బ్రార్‌.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు కూడా. బిష్ణోయ్‌ సోదరుడు విక్కీ మిద్దుఖేరా హత్య కేసులో సిద్దూ మేనేజర్‌ షగన్‌ప్రీత్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ ఘటన తర్వాత షగన్‌ప్రీత్‌.. విదేశాలకు పారిపోయాడు. అయితే ఈ వ్యవహారంలో సిద్ధూనే షగన్‌ప్రీత్‌కు సహకరించి ఉంటాడని బిష్ణోయ్‌ అనుచరులు నమ్మారు. అందుకే నాలుగు రోజులు రెక్కీ వేసి మరీ సింగర్‌ సిద్ధూని కిరాతకంగా కాల్చి చంపారు. 

సిద్ధూ కుటుంబానికి సీఎం పరామర్శ
సింగర్‌ సిద్ధూ మూసే వాలా కుటుంబాన్ని పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ పరామర్శించారు. శుక్రవారం మన్సా జిల్లా మూసే గ్రామానికి వెళ్లి.. సిద్ధూ కుటుంబాన్ని ఓదర్చారు. దారిపోడవునా.. నిరసనకారులు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఎలాగోలా సిద్ధూ ఇంటికి చేరారు సీఎం భగవంత్‌. ఈ సందర్భంగా.. తమకు న్యాయం చేయాలని సిద్ధూ కుటుంబం సీఎంని కోరింది.

చదవండి: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top