
ముంబై: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు దారితప్పి సాగించిన బాగోతం ఇప్పుడు మహారాష్ట్రను కుదిపేస్తోంది. రాష్ట్ర విద్యాశాఖకు చెందిన షలార్త్ పోర్టల్‌ను దుర్వినియోగం చేస్తూ, కొందరు సీనియర్ విద్యాధికారులు నకిలీ టీచర్ ఐడీలను సృష్టించి, అర్హత లేని వ్యక్తుల నుంచి డబ్బు తీసుకుని, వారిని టీచర్లుగా నియమించారని వెల్లడయ్యింది. ఈ విధమైన అక్రమాల ద్వారా వీరు మూడువేల కోట్ల రూపాయల వరకూ స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బయటపడిన దరిమిలా ప్రభుత్వం విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో భాగస్వాములైన కొందరిని ఇప్పటికే అరెస్టు చేశారు. మరికొందరిని సస్పెండ్ చేశారు.
ముంబై, నాగ్‌పూర్ జోన్‌ల విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్లు, ఈ కుంభకోణం కోసం వేలాది నకిలీ ఐడీలను సృష్టించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. షలార్త్ ఐడీ గురించి మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రామ్ పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయుని ఖాళీ ఏర్పడినప్పుడు.. ఆ స్థానంలో ఇంకొక అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత, సదరు పాఠశాల అపాయింట్‌మెంట్ ఆర్డర్ జారీ చేస్తుంది. తరువాత ఆ అభ్యర్థి ఈ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో ఆ జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అతను దానిని ఆమోదించి, అభ్యర్థికి షలార్త్ ఐడీని, పాస్‌వర్డ్‌ను అందిస్తారు. ఈ ఐడీ అతనికి జీతంతో పాటు ఇతర ప్రయోజనాలను అందుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇది లేకుండా ఏ ఉపాధ్యాయునికీ చెల్లింపులు జరగవు. షలార్త్ పోర్టల్‌లో రాష్రంలోని విద్యాశాఖ సిబ్బంది సమగ్ర సమాచారం ఉంటుంది.
షలార్త్ ఐడీలను జారీ చేసే అధికారం విద్యా డిప్యూటీ డైరెక్టర్‌కు ఉంటుంది. ఈ కార్యాలయంలోని పలువురు అధికారులు బోగస్ ఐడీలను సృష్టించి, వాటి సాయంతో జీతాలను స్వాహా చేశారు. ఇందుకోసం నకిలీ ఆధారాలు ఉపయోగించి, పలు బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పోస్టులలో అర్హత లేని వారిని నియమించి, వారి నుంచి భారీగా లంచాలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఎయిడెడ్ పాఠశాలల రికార్డులపై ప్రభుత్వ పర్యవేక్షణ పరిమితంగా ఉండటమే ఈ తరహా అవినీతికి కారణమని పలువురు అంటున్నారు.
ఈ కుంభకోణంలో నాగ్‌పూర్ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉల్హాస్ నారద్ అరెస్టు అయ్యారు. ఈయన నకిలీ ఐడీలు, బ్యాంకు ఖాతాలను సృష్టించేందుకు అధికారులకు సహాయం చేశారని విచారణలో తేలింది. జూలై 18న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో మాట్లాడుతూ షలార్త్ ఐడీ కుంభకోణంలో మూడు కోట్ల రూపాయల వరకు దుర్వినియోగం జరిగివుండవచ్చన్నారు. ఈ ఐడీ కుంభకోణంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదే ఉదంతంలో ప్రమేయం ఉన్న ముంబై డిప్యూటీ డైరెక్టర్ సందీప్ సంగవేను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.