ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టం..భద్రతకు భరోసా

Explanation Of Electronic Interlocking - Sakshi

ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత బాగా తగ్గిన రైలు ప్రమాదాలు  

రైళ్లకు ట్రాక్‌లను కేటాయించడంలో కీలకం

ఒడిశా ప్రమాదానికి ఇతర పరిస్థితులు, మానవ తప్పిదాలే కారణమంటున్న నిపుణులు

ఒడిశా రైలు దుర్ఘటనకు ప్రధాన కారణం ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఒకే ట్రాక్‌పై ప్రయాణించే రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టకుండా కవచ్‌ అనే ఆధునిక వ్యవస్థ ఉన్నప్పటికీ భారీ ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఒడిశా ప్రమాద ఘటనకు కవచ్‌ వ్యవస్థతో సంబంధం లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వయంగా ప్రకటించారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌(ఈఐ) వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పుల వల్లే ఈ ఘోరం జరిగిందని తెలిపారు. బాధ్యులను గుర్తించామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, రైలు సేఫ్టీ కమిషనర్‌ త్వరలో నివేదిక అందజేస్తారని వెల్లడించారు. సిగ్నలింగ్‌లో లోపాల కారణంగానే రైలు ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అసలు ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ అంటే ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? దాని వల్ల రైళ్లు ఎంత భద్రం? అనేది తెలుసుకుందాం.. 

ఏమిటీ లాకింగ్‌ సిస్టమ్‌
► రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో ఇదొక అంతర్భాగం. నిర్దేశిత మార్గాల్లో రైళ్లు క్షేమంగా రాకపోకలు సాగించేలా ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా నియంత్రిస్తారు.
► గతంలో మెకానికల్, ఎలక్ట్రో–మెకానికల్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలు ఉండేవి. వాటి ఆధునిక రూపమే ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌.
► సంప్రదాయ ప్యానెల్‌ ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రో–మెకానికల్‌ ఇంటర్‌లాకింగ్‌తో పోలిస్తే ఈ అధునాతన వ్యవస్థతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
► సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పనిచేస్తుంది. సిగ్నలింగ్‌ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేర్పులైనా సులభంగా చేసుకోవచ్చు.
► ఇది ప్రాసెసర్‌ ఆధారిత వ్యవస్థ అని నిపుణులు చెబు­తున్నారు. విస్తృతమైన ప్రయోగ పరీక్షల తర్వాతే దీన్ని తీసుకొచ్చారు.
► ట్రైన్‌ డిటెక్షన్‌ సిస్టమ్, సిగ్నళ్లు, పాయింట్లు, ట్రాక్‌ సర్క్యూట్లు వంటి వాటితో అనుసంధానమై పనిచేస్తుంది. ఇందుకోసం కంప్యూటర్లు, ప్రోగ్రామ్‌బుల్‌ లాజిక్‌ కంట్రోలర్లు, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్, సెన్సార్లు, ఫీడ్‌ బ్యాకింగ్‌ పరికరాలు ఉపయోగిస్తారు.
► రైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రమాదాల జరగకుండా నియంత్రించడానికి వీలుంటుంది.
► ఒకే ప్రాంతంలో ఒకే పట్టాల(ట్రాక్‌)పై ఏకకాలంలో రెండు రైళ్లు ఉండకుండా చూస్తుంది. రైళ్లకు ట్రాక్‌లను కేటాయించే వ్యవస్థ ఇది.
► ఒక మార్గంలో ప్రయాణం పూర్తి సురక్షితం అని తేలేదాకా రైలుకు సిగ్నల్‌ ఇవ్వకుండా ఆపేస్తుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక రైలు ప్రమాదాలు, పరస్పరం ఢీకొనడం వంటివి చాలావరకు తగ్గిపోయాయి

రైళ్ల భద్రతే లక్ష్యంగా...
ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ రైళ్ల భద్రతే లక్ష్యంగా పని చేస్తుంది. రైళ్ల రాకపోకలు, సిగ్నల్స్, ట్రాక్స్‌ను నియంత్రించడానికి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఒకప్పుడు మనుషులు చేసిన పనిని ఇప్పుడు కంప్యూటర్ల సాయంతో నిర్వర్తిస్తున్నారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌­లో 45 శాతానికి పైగా స్టేషన్లు ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థతో అనుసంధానమయ్యా­యి. రైల్వేల ఆధునికీకరణలో భాగంగా ఎలక్ట్రా­నిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తోంది. 2022–23లో కొత్తగా 347 స్టేషన్లలో ఈ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. దేశంలో బ్రాడ్‌గేజ్‌(బీజీ) మార్గాల్లో 6,506 రైల్వే స్టేషన్లు ఉండగా, వీటిలో 6,396 స్టేషన్లలో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ ఏర్పాట­య్యింది. ఒడిశాలో ప్రమాదం జరిగిన బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌లోనూ ఈ వ్యవస్థ ఉంది.

వైఫల్యాలు ఎందుకు?  
► ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ సమర్థంగా పనిచేయడమే కాదు, మొరాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
► ఈ వ్యవస్థలో ఏదైనా లోపం తలెత్తితే సిగ్నల్‌ వెంటనే ఎరుపు రంగులోకి మారిపోతుంది. తద్వారా రైలు నడిపించే లోకో పైలట్‌కు తక్షణమే సంకేతం అందుతుంది.
► ఒకవేళ ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ వైఫల్యం చెందితే అందుకు బహిర్గత పరిస్థితులు, మానవ చర్యలే చాలావరకు కారణమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
► ఒడిశా ఘటనలో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌లో నార్మల్‌ లైన్‌పై పాయింట్‌ సెట్‌ చేయాల్సి ఉండగా, లూప్‌లైన్‌పై చేశారని, మానవ ప్రమేయం లేకుండా ఇది జరిగేది కాదని సిగ్నలింగ్‌ నిపుణుడొకరు చెప్పారు.
► రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తవ్వకాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దానివల్ల అక్కడ సిగ్నలింగ్‌కు సంబంధించిన వైర్లు దెబ్బతినడం లేదా షార్ట్‌ సర్క్యూట్‌ జరగడం, ఫలితంగా రైలుకు సరైన సంకేతం ఇవ్వడంలో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ వైఫల్యం చెంది ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top