
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘర్షణలు మొదలయ్యాయి. గత నెల రోజులుగా మైతీలు, కుకీలకు మధ్య చెలరేగిన అల్లర్లు నేటికి కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ క్షీణిస్తుండటంతో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా ఆందోళన కారులు రెచ్చిపోతున్నారు. భారీ సంఖ్యలో గుంపుగా తరలివచ్చి విధ్వంసానికి తెగబడుతున్నారు. స్థానికంగా ఉన్న బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు సహా, స్థానిక ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీ నేతల ఇళ్లపై పెట్రో బాంబులతో దాడి చేసి ధ్వంసం చేస్తున్నారు.
అయితే రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ఆర్మీ విశ్రాంత అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇంఫాల్‌లో నివసిస్తున్న ఆర్మీకి చెందిన విశ్రాంత అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిషికాంత సింగ్ ట్వీట్ చేశారు, ‘‘నేను విశ్రాంత జీవితం గడుపుతోన్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ సాధారణ భారతీయుడిని. మణిపూర్‌ను ఇప్పుడు ఎవరూ రాష్ట్రంగా గుర్తించట్లేదు. మణిపూర్ స్టేట్ లెస్‌గా మారింది. ఇక్కడ లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా మాదిరిగా ఎప్పుడైనా, ఎవరివల్లైనా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించవచ్చు. ఇదంతా ఎవరైనా వింటున్నారా..?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
విశ్రాంత అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిషికాంత సింగ్, మాజీ ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్
కాగా నిషికాంత్ ట్వీట్‌పై మాజీ ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్ స్పందించారు. మణిపూర్ చెందిన ఓ విశ్రాంత అధికారి నుంచి విచారకరమైన పిలుపు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అత్యున్నత స్థాయిలో తక్షణ చర్యలు అవసరం అంటూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ట్యాగ్ చేశారు.
An extraordinary sad call from a retired Lt Gen from Manipur. Law & order situation in Manipur needs urgent attention at highest level. @AmitShah @narendramodi @rajnathsingh https://t.co/VH4EsLkWSU
— Ved Malik (@Vedmalik1) June 16, 2023
అసలు ఎందుకీ ఘర్షణలు?
మణిపూర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది ఉన్న మైతీలు తమకు షెడ్యూల్డు తెగల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎస్టీ హోదా కోసం మైతీలు చేస్తున్న డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపు మేరకు బుధవారం గిరిజన సంఘీభావ కవాతును నిర్వహించారు. ఈ కవాతు చురాచాంద్‌పూర్ జిల్లాలోని టోర్బుంగ్ ఏరియాలో జరిగింది.
ఈ కార్యక్రమంలో నాగాలు, జోమీలు, కుకీలు పాల్గొన్నారు. అయితే చురాచాంద్‌పూర్ జిల్లాలో బుధవారం జరిగిన గిరిజన కవాతు పలుచోట్ల ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అనంతరం లోయలోని జిల్లాలన్నిటికీ హింసాకాండ విస్తరించింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస జరిగింది.