రోదసిలోకి భూ పరిశీలన ఉపగ్రహం

EOS-4 Satellite via PSLV-C52 - Sakshi

పీఎస్‌ఎల్‌వీ – సి 52 ద్వారా ఈఓఎస్‌–4 శాటిలైట్‌

కౌంట్‌డౌన్‌ నేడు ప్రారంభం

సోమవారం ఉదయం 5.59 గంటలకు ప్రయోగం

సూళ్లూరుపేట: భూ పరిశీలన ఉపగ్రహం రాడర్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ (ఈఓఎస్‌–4)ను ఇస్రో సోమవారం రోదసిలోకి ప్రవేశపెట్టనుంది. పీఎస్‌ఎల్‌వీ – సి 52 ద్వారా 1710 కిలోల బరువు కలిగిన ఈఓఎస్‌–4తో పాటు భారత దేశంలోని ఐఐటీ కళాశాల విద్యార్థులు తయారు చేసిన రెండు చిన్న ఉపగ్రహాల (ఇన్‌స్పైర్‌ శాట్‌–1, ఐఎన్‌ఎస్‌–2టీడీ)ను కూడా రోదసీలోకి పంపుతున్నారు. శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ–సి 52ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో శనివారం ఎంఆర్‌ఆర్‌ (మిషన్‌ రెడీనెస్‌ రెవ్యూ) సమావే శం నిర్వహించారు. రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి ప్రయోగాన్ని లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ రాజరాజన్‌కు అప్పగించారు.

ఆయన ఇతర శాస్త్రవేత్తలతో లాంచ్‌ సమావేశం నిర్వహించి ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఆదివారం ఉదయం 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 25.35 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తుంది. ఉపగ్రహాలను 529 కిలోమీటర్ల ఎత్తులోని సన్‌ సింక్రసన్‌ కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఈఓఎస్‌–4 ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్, భూమిపై జరిగే మార్పులు, వరదలు, వాతావరణం వంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అత్యంత నాణ్యమైన ఛాయా చిత్రాల ద్వారా సమాచారాన్ని అందిస్తుంది.

శ్రీవారి వద్ద పీఎస్‌ఎల్‌వీ – సి52 నమూనాకు ప్రత్యేక పూజలు
తిరుమల: పీఎస్‌ఎల్‌వీ – సి52 నమూనాకు శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమూనాను ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమలకు తీసుకువచ్చింది. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. నమూనాను శ్రీవారి మూల విరాట్‌ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.

మరిన్ని ప్రయోగాలకు సిద్ధం:  – ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు. చంద్రయాన్‌–3, గగన్‌యాన్‌–1కు సంబంధించి పలు ప్రయోగాత్మక పరీక్షలు చేపడతామన్నారు. పీఎస్‌ఎల్‌వీ– సి 52 ప్రయోగం విజయవంతం కావాలని శనివారం సాయంత్రం సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రయోగాలకు అంతరాయం కలిగిందన్నారు. ఇస్రో చైర్మన్‌గా తనకు ఇది తొలి ప్రయోగం కావడంతో విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాడార్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ దేశంలో ఉన్న సామాన్యుడికి కూడా దీర్ఘకాలిక సేవలందిస్తుందని తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ సీ–53 ప్రయోగానికి కూడా సిద్ధమవుతున్నామని తెలిపారు.  ఆయన వెంట షార్‌ అధికారి గోపీకృష్ణ తదితరులు ఉన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top