భక్తిశ్రద్ధలతో రంజాన్‌ | Eid al-Fitr prayers held as Muslims mark end of Ramadan | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో రంజాన్‌

Mar 22 2026 5:54 AM | Updated on Mar 22 2026 6:10 AM

Eid al-Fitr prayers held as Muslims mark end of Ramadan

ఈద్‌ ముబారక్‌

న్యూఢిల్లీ/దుబాయ్‌/భోపాల్‌/శ్రీనగర్‌: రంజాన్‌ పర్వదినాన్ని శనివారం దేశవ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాలు, మసీదుల ప్రాంగణాలు, స్టేడియంలు, బహిరంగ ప్రాంతాలు, విశాల మైదానాల్లో పెద్దసంఖ్యలో జనం ముస్లింలు ఒకేచోటకు చేరుకుని సామూహికంగా నమాజ్‌ చేశారు. శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం మరింత వెల్లివిరియాలని కోరుకున్నారు. 

ముస్లిం సోదరుల ఆతీ్మయ ఆలింగనాలతో ఆ ప్రాంతాలన్నీ పర్వదిన శోభను సంతరించుకున్నాయి. పాత ఢిల్లీ మొదలు జమ్మూకశ్మీర్‌ దాకా చాలా ప్రాంతాల్లో ముస్లింలు తమ బంధువుల ఇళ్లకు వెళ్లి పరస్పరం పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ మొదలు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, విపక్ష నేతల దాకా ముఖ్యనేతలంతా దేశవ్యాప్తంగా ముస్లింలకు ఈద్‌–ఉల్‌–ఫితర్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు నాయకులంతా తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్‌లు పెట్టారు. ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదుతోపాటు ఫతేపురీ మసీదు, సీలాంపూర్, ఓఖ్లా, నిజాముద్దీన్‌ మసీదుల్లో పెద్దసంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పెద్దసంఖ్యలో ఢిల్లీ పోలీస్, పారా మిలటరీ బలగాలు శాంతియుతంగా పండుగ జరిగేలా చూసుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లోనూ పండగను ముస్లింలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. శ్రీనగర్‌లో దాల్‌ సరస్సు సమీపంలో పురాతన హజ్రత్‌బల్‌ మసీదు ఆవరణలో భారీసంఖ్యలో ముస్లింలు ప్రార్థనలుచేశారు. అయితే వరసగా ఏడో ఏడాదీ శ్రీనగర్‌ ఓల్డ్‌ సిటీ జామామసీదులోకి ఈద్‌ ప్రార్థనలకు స్థానికులను స్థానికయంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. లక్నోలోని అయి‹Ùబాగ్‌ ఈద్గాలో జరిగిన ప్రార్థనల్లో క్రైస్తవ, సిక్కు నేతలు సైతం పాల్గొనడం విశేషం. కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో వార్షిక ‘ప్రార్థనా సమూహం’ కార్యక్రమంలో భారీసంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ‘‘ఈద్‌–ఉల్‌–ఫితర్‌ వేళ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి అంతటా మరింతగా సోదరభావం, కరుణ విస్తరించాలి. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈద్‌ ముబారక్‌’’అని ప్రధాని మోదీ శనివారం తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌చేశారు. 

పలుచోట్ల యుద్ధవ్యతిరేక నిరసనలు 
రంజాన్‌ జరుపుకునే ఇరానియన్లపై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌లను తప్పుబడుతూ జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్, బందీపొరా, రాజస్తాన్‌లోని సిఖార్, అజీ్మర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ తదితర ప్రాంతాల్లో షియా ముస్లింలు నల్ల బ్యాడ్జీలు, పాత దుస్తులు ధరించి నిరసన ర్యాలీలు చేపట్టారు. అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేక నినాదాలు చేశారు. నిరసనగా కొన్ని మసీదులపై నల్లజెండాలను ఎగరేశారు. ఇరాన్‌ సుప్రీంనేత, షియా ముస్లింల కీలక నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని చంపేసినందుకు సంతాపసూచికగా మధ్యప్రదేశ్‌లో కొన్ని చోట్ల షియా ముస్లింలు ఈద్‌కు దూరంగా ఉండిపోయారు. భోపాల్‌లోని ప్రసిద్ధ ఇమామ్‌బారాలో ఖమేనీ భారీ కటౌట్‌ను పెట్టారు. అయితే కొన్ని చోట్ల మాత్రం సున్నీ వర్గీయులు వేడుకలు జరుపుకోవడం గమనార్హం.

టెహ్రాన్‌లో భారీ ప్రదర్శనలు, ప్రార్థనలు 
రంజాన్‌ను పురస్కరించుకుని ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ సంఖ్యలో జనం మసీదులు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలుచేశారు. యుద్ధం ముగిసిపోవాలని కోరుకున్నారు. ‘‘అయతొల్లా అలీ ఖమేనీ లేకుండా ఈద్‌ ప్రార్థనలు జరగడం నన్నెంతో కలిచివేస్తోంది. ఇటీవల మరణించిన జనరల్‌ అలీ మొహమ్మద్‌ నయీనీ కోసం సైతం ప్రార్థనలుచేశాం’’ అని ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) అధికార ప్రతినిధి చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement