భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం ఎలా? ఆస్ట్రేలియా టెక్నాలజీతో చెక్ పెట్టొచ్చా?

భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం ఎలా? - Sakshi

పండుగ సీజన్, న్యూ ఇయర్ లాంటివి వచ్చినప్పుడు భారత్‌లో డ్రైంక్ అండ్ డ్రైవ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. తాగి వాహనాలు నడపడం వల్ల ఒక్కోసారి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి 1న ఢిల్లీ కంఝవాలలో యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనే ఇందుకు ప్ర‍త్యక్ష ఉదాహరణ. మద్యం మత్తులో బండ్లు నడిపి వాళ్ల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు కొందరు.

భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులకు కఠిన శిక్షలే ఉన్నాయి. తాగి బండి నడిపితే రూ.10వేలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష. రెండోసారి ఈ తప్పు చేస్తే రూ.15వేల జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. బ్రిటన్, స్వీడన్ సహా పలు దేశాల్లో ఇలాంటి కఠిన శిక్షలే అమలు చేస్తున్నారు. బ్రిటన్‌లో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి అధికారులు ఎంత పెనాల్టీ అయినా విధించవచ్చు. దీనికి పరిమితే లేదు.

నిబంధనలు ఇంత కఠినంగా ఉన్నా కొంతమంది వాహనదారులు అసలు లెక్కచేయడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడతామన్న భయం లేకుండా యథేచ్ఛగా మద్యం సేవించి బండ్లు నడుపుతున్నారు. ఎలాగోలా తప్పించుకోవచ్చనో, లేక దొరికినా బయటకు రావచ్చనే ధీమానో తెలియదు గానీ భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలు పండుగ సీజన్లలో, సెలవు దినాల్లో చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఆస్ట్రేలియా టెక్నాలజీతో చెక్?
మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా.. ఆస్ట్రేలియాలో మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్‌ను కట్టడి చేసేందుకు వినూత్న సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 'ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ సిస్టమ్' పేరుతో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.. ఈ వ్యవస్థ ఉన్న కార్లు స్టార్ అవ్వాలంటే డ్రైవర్ కచ్చితంగా బ్రీత్ ఎనలైజర్ ఊదాలి. అతడు ఆల్కహాల్ సేవించలేదని నిర్ధరించుకున్నాకే కారు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ బ్రీత్ ఎనలైజర్ సాంపిల్‌లో ఆల్కహాల్ ఉన్నట్లు తేలితే కారు ‍‍స్టార్ట్ అవ్వదు.

డ్రైవర్లు చీటింగ్ చేయకుండా బ్రీత్ ఎనలైజర్ సాంపిల్ ఇచ్చే సమయంలో ఫొటో తీసే విధంగా ఈ టెక్నాలజీని రూపొందించారు. ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ వ్యవస్థ ఆస్టేలియాలో సత్ఫలితాలనే ఇచ్చింది. రోడ్డు భద్రతకు ఇది చాలా ముఖ్యమని 2021లో 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. భారత్‌లో కూడా ఇలాంటి సాంకేతికతను తీసుకువస్తే డ్రంక్ డ్రైవ్ ఘటనలను అరికట్టి ప్రమాదాలను నివారించవచ్చని అంతా భావిస్తున్నారు.
చదవండి: అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top