Monkeypox And Covid 19: కరోనా, మంకీపాక్స్‌ రెండూ ఒకే రకమైన వైరస్‌లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Difference Between Covid 19 And Monkeypox - Sakshi

కోవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో పెనుముప్పు ఎదురవుతోంది. ఈ వ్యాధి ఇప్పటికే 70దేశాలకు పైగా వ్యాపించింది. 16 వేలకుపైగా కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా దీన్ని హెల్త్ ఎమెర్జెన్సీగా ప్రకటించింది. భారత్‌లోనూ ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో కోవిడ్, మంకీపాక్స్ రెండు వైరస్‌లకు ఉన్న తేడా ఏంటి? వ్యాధి తీవ్రత విషయంలో ఏది మనిషి ప్రాణాలపై అధిక ప్రభావం చూపిస్తుంది అనే చర్చ మొదలైంది.

రెండూ భిన్నం..
కోవిడ్ 19, మంకీపాక్స్ వైరస్‌లు పూర్తిగా భిన్నం. సార్స్‌ కోవ్‌-2 వల్ల కరోనా వస్తుంది. మంకీపాక్స్.. పాక్స్‌విరిడే కుటుంబంలోని ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందింది.  ఇందులో వేరియోలా వైరస్ (మశూచి కారకం), వ్యాక్సినియా వైరస్ (మశూచి వ్యాక్సిన్‌లో ఉపయోగించేది), కౌపాక్స్ వైరస్లు ఉన్నాయి.

సార్స్ కోవ్‌-2 వైరస్ మనుషుల శ్వాసకోశ వ్యవస్థ ద్వారా లోనికి ప్రవేశించి ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడి చేస్తుంది.  మంకీపాక్స్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ రెండింటి మధ్య తేడాను మెరీలాండ్ యూనివర్సిటీ అంటువ్యాధుల నిపుణుడు డా.ఫహీమ్‌ సింపుల్‌గా తేల్చారు. కోవిడ్ పాము కాటుతో సమానం అయితే.. మంకీపాక్స్‌ నల్లుల లాంటివని పేర్కొన్నారు.

లక్షణాలు ఇలా..
కోవిడ్, మంకీపాక్స్ లక్షణాలు చూడటానికి కాస్త ఒకేలా కన్పించినప్పటికీ రెండింటి మధ్య తీవ్రత విషయంలో చాలా తేడా ఉంటుంది. కరోనా రోగుల్లో జ్వరం, చలి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది, అలసట, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, గొంతులో నొప్పి వంటి లక్షణాలుంటాయి. 

మంకీపాక్స్‌ బాధితుల్లో కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దద్దుర్లు నొప్పిని కలుగజేస్తాయి.

వ్యాప్తి ఇలా..
కరోనా ఒకరి నుంచి ఒకరికి సులభంగా, వేగంగా వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా, ఒకరు తాకిన వస్తువులను ఇతరులు ముట్టుకోవడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ మాత్రం ప్రధానంగా స్కిన్‌ టు స్కిన్‌ (చర్మం చర్మం కలుసుకోవడం) ద్వారా ప్రబలుతుంది. వ్యాధి సోకిన వారు ఉపయోగించిన వస్త్రాలు, దుస్తులను ఇతరులు వాడినా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వైరస్‌ లైంగికంగా సంక్రమిస్తోందని ఇప్పటికే తేలగా.. వ్యాధి విస్తరణకు ఇంకా ఇతర కారణలేమైనా ఉన్నాయా? అని కనుగొనేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీపాక్స్‌ వ్యాధి.. స్వలింగ సంపర్గం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.

చికిత్స ఏంటి?
కోవిడ్‌ మహమ్మారి బారినపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో పరిశోధనల అనంతరం కరోనా వైరస్‌ నివారణకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. దాంతో మరణాలు రేటు తగ్గింది. అయితే మంకీపాక్స్ గురించి ప్రపంచదేశాలకు దశాబ్దాలుగా తెలుసు. దీని విరుగుడుకు వ్యాక్సిన్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. స్మాల్‌పాక్స్ (మశూచి) వ్యాక్సిన్‌నే మంకీపాక్స్ బాధితులకు ఇస్తున్నారు. అది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. అయితే కరోనా వ్యాక్సిన్లలా మంకీపాక్స్‌ వ్యాక్సిన్‌ను ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేయడం లేదు. డెన్మార్క్‌కు చెందిన బవారియన్ నోర్డిక్ కంపెనీ మాత్రమే మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. 
చదవండి: రాజ్యసభ సీటు కావాలా? గవర్నర్‌ పదవి కావాలా? రూ.100 కోట్లివ్వు పని అయిపోద్ది..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top