కమ్మేసిన కాలుష్యపు పొగ మంచు
కనిపించని యుద్ధ స్మారక చిహ్నం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఢిల్లీ కాలుష్యంపై సర్వత్రా ఆందోళన
ఢిల్లీలోని ఇండియా గేట్ అదృశ్యమైంది.. మీరు చదివింది నిజమే.. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోను చూస్తే మీరూ ఏకీభవిస్తారు. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) ఆందోళనకర స్థాయికి చేరుకుంటోంది. ఢిల్లీలో అక్టోబర్ 1వ తేదీ.. శనివారం ఇండియా గేట్ ప్రాంతంలో ఏక్యూఐ 295గా నమోదైంది. అదే సమయంలో కమ్ముకున్న దట్టమైన పొగమంచు వెనుక ఇండియా గేట్ అదృశ్యమైనట్టు అనిపించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అయ్యింది.
కలకలం రేపిన వీడియో
ఇండియా గేట్ దేశంలోనే అత్యంత గరి్వంచదగిన యుద్ధ స్మారక చిహా్నలలో ఒకటి. అయితే ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టిన ఒక వీడియో చూశాక.. ఇండియా గేట్ మాయమైపోయిందా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. నిజానికి ఇండియా గేట్ ఎక్కడికీ పోలేదు. దట్టమైన పొగమంచులో ఆ కట్టడం చిక్కుపోవడంతో అదృశ్యమైనట్లు అనిపించింది. ఈ వీడియో క్లిప్ మసకగా కనిపించింది. పసుపు రంగు లైట్‌బీమ్‌లు మినహా, ఇండియా గేట్ క్లిప్‌లోని మిగిలిన భాగం మసకగా ఉంది. ఏఎన్‌ఐ వివరాల ప్రకారం, ఈ సంఘటన అక్టోబర్ 1వ తేదీ శనివారం సాయంత్రం జరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం, ఆ సమయంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 295 వద్ద నమోదైంది. ఇది అత్యంత సాధారణ స్థాయి కిందకు వస్తుంది.
నెటిజన్ల మండిపాటు
వీడియో వైరలైన వెంటనే నెటిజన్లు స్పందించడం ప్రారంభించారు. చాలా మంది.. కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు, జంతువులలో తలెత్తే అనారోగ్యం, భవిష్యత్తు సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన వారు.. కాలుష్య కారకాలపై కఠినమైన చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వం సంఖ్యలను తారుమారు చేయడంలో, ఢిల్లీ స్థానాన్ని మార్చడంలో బిజీగా ఉంది. వాళ్లు ఎందుకు పట్టించుకుంటారు?’.. అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. ‘మనకు సిగ్గుచేటు.. ఇంకా ఈ రోజు కూడా బాణసంచా కాల్చుతున్నారు’.. అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.
‘రాజధానిని మార్చడం చాలా అవసరం. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను దేశవ్యాప్తంగా తరలించాలి. ఢిల్లీ ప్రవేశానికి తప్పనిసరిగా విద్యుత్ వాహనాలను వినియోగించాలన్న నిబంధన అమలు చేయాలి’.. అని మరొకరు డిమాండ్ చేశారు. ‘ఇది ఢిల్లీలో ప్రతి అక్టోబర్–నవంబర్ మాసాల్లో సర్వసాధారణ సమస్యగా మారుతోంది. వరి పొలాల వ్యర్థాలను కాల్చడం, నిర్మాణ ధూళి, వాహనాల ఉద్గారాలు, తక్కువ ఆక్సిజన్ తదితర పరిస్థితుల వల్ల ఏర్పడిన సంక్లిష్టత ఇది. దీనికి నిర్మాణాత్మక పరిష్కారాలు అవసరం’.. అని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం, ఏక్యూఐ.ఇన్ మానిటర్ ప్రకారం, ఢిల్లీ నగరం మొత్తం ఏక్యూఐ 244గా నమోదైంది. ఇది అత్యంత కాలుష్య తీవ్రతను తెలియజేస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


