ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం

Day after Diwali, Delhi Air Quality Goes Beyond Red - Sakshi

ఢిల్లీలో డేంజర్‌ బెల్స్‌

ప్రమాదకర స్థాయికి వాయు నాణ్యత

పంటవ్యర్థాల కాల్చివేత, దీపావళి బాణాసంచా ఎఫెక్ట్‌

'ఆరోగ్యం జాగ్రత్త’ అంటున్న నిపుణులు

సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి బాణాసంచా ఎఫెక్ట్‌ దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)పై స్పష్టంగా కనిపించింది. పండుగ ముందు రోజులతో పోలిస్తే పండుగ తర్వాత నమోదైన వాయు నాణ్యత ఐదేళ్లలోనే అత్యల్పం కావడం గమనార్హం. దీనికి చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాలుష్యం తోడయింది. దీంతో, ఎన్‌సీఆర్‌ పరిధిలోని ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్‌ల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ దీపావళి రోజున ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు కళ్లు, గొంతు మంట వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆదివారం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు.

చదవండి: (పశ్చిమబెంగాల్‌ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత)

తక్కువ ఉష్ణోగ్రతలు, కాలుష్య కారకాలు పేరుకుపోవడం, ఆకాశం మేఘావృతమైన కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జన్‌పథ్‌లో వాయు నాణ్యత ప్రమాదకర పీఎం 2.5 స్థాయి 655.07కి చేరుకుంది. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం సమీపంలో పీఎం 2.5 స్థాయి 999గా నమోదైంది. ప్రమాణాల ప్రకారం, పీఎం 2.5 స్థాయి 380 కంటే ఎక్కువగా ఉంటే దానిని తీవ్రమైందిగా పరిగణిస్తారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో సగటున వాయు నాణ్యత ఢిల్లీలో 462, ఫరీదాబాద్‌లో 469, ఘజియాబాద్‌లో 470, గురుగ్రామ్‌లో 472, నోయిడాలో 475, గ్రేటర్‌ నోయిడాలో 464కి చేరుకుంది.  

కోవిడ్‌ బాధితులపై తీవ్ర ప్రభావం
దీపావళి తర్వాత రోజున 2016లో 445, 2017లో 403, 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462 వాయుకాలుష్య తీవ్రత నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారిపై కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు  హెచ్చరిస్తున్నారు. వీరు మార్నింగ్‌ వాక్‌ మానేయాలని, శ్వాస సంబంధ, హృద్రోగ సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.   

చదవండి: (కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ) 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top