పగలు రాముడి పేరిట విరాళం.. రాత్రయితే మద్యంతో చిందులు

Congress MLA sensational comments on Ram Mandir Donation - Sakshi

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

భోపాల్‌: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇటీవల తెలంగాణలో ఓ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేయగా.. తాజాగా ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో మరో సీనియర్‌ నాయకుడు సంచలన ఆరోపణలు చేశారు. రామమందిరం పేరిట సేకరిస్తున్న విరాళాలతో బీజేపీ నాయకులు మద్యం కొనుగోలు చేసి తాగి ఎంజాయ్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఆయనెవరో కాదు మధ్యప్రదేశ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కాంతిలాల్‌ భూరియా.

తాజాగా పెట్లవాడ్‌ పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాలతో కొందరు బీజేపీ నేతలు మద్యం సేవిస్తున్నారు. రామాలయం పేరుతో కొందరు కాషాయ నేతలు విరాళాలు సేకరిస్తూ వాటితో మద్యం కొనుగోలు చేస్తున్నారు. పగలు రాముడి గుడి పేరు చెప్పి విరాళాలు సేకరించి రాత్రి కాగానే ఆ మొత్తంలో కొంత మద్యం సేవించేందుకు వాడుతున్నారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

క్రాంతిలాల్‌ భూరియా ఎవరో కాదు రెండు సార్లు కేంద్ర మంత్రిగా పని చేయగా.. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జాబువా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలు కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. దేశవ్యాప్తంగా రామమందిర నిర్మాణం కోసం స్వచ్ఛందంగా విరాళాలను సేకరించే బాధ్యతను ఆరెస్సెస్‌, వీహెచ్‌పీలతో పాటు సమాజంలో విశ్వసనీయ సంస్థలకి శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ అప్పగించిన విషయం తెలిసిందే. అంతకుముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కూడా విరాళాల సేకరణపై స్పందించారు. విరాళాలను సేకరించే ర్యాలీల సందర్భంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఉజ్జయిని, మందసోర్‌, ఇండోర్‌ల్లో జరిగిన ర్యాలీల అనంతరం చెలరేగిన హింసపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top