వాతావరణ మార్పుల దుష్ప్రరిణామానికి బలవుతున్న నదీమతల్లులు
చేపలు, జలచరాలకు ప్రాణసంకటంగా తయారైన గ్లోబల్ వార్మింగ్
శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగంతో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతలు ఎగసి వాతావరణ మార్పులు సర్వసాధారణమవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ధాటికి వర్షాలు తగ్గి పంటదిగుబడి దారుణంగా పడిపోయి ప్రజలకు ఆకలికష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. వాతావరణ మార్పులు అనేవి ఒక్క మానవాళికే కాదు జలచరాలకూ కొత్త పెనుసమస్యగా దాపురించిందని అంతర్జాతీయ అధ్యయనం ఒకటి హెచ్చరికలు చేసింది.
ఉష్ణోగ్రతలు పెరగడంతో నదీజలాల ఉపరితల ఉష్ణోగ్రతలు హెచ్చుతున్నాయని దీంతో నదీజలాల నుంచి ఆక్సిజన్ నెమ్మదిగా అదృశ్యమవుతోందన్న ప్రమాదహెచ్చరికలను చైనాలోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలసహితంగా వెల్లడించారు. 1985 ఏడాది నుంచిచూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 21,000 ప్రధాన నదుల్లో ఆక్సిజన్ స్థాయిలు నెమ్మదిగా తగ్గుతున్నాయని అధ్యయనంలో తేలింది. 1985 ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ముఖ్యమైన నదీజలాల్లో ఆక్సిజన్ 2.1 శాతం తగ్గిందని వెల్లడైంది.
ఉష్ణోగ్రతలు ఇలాగే అత్యధిక స్థాయిల్లో కొనసాగితే నదీజలాల్లో ఆక్సిజన్ క్షీణత మరింత పెరిగే ఆస్కారముంది. ఆక్సీజన్ తగ్గిపోతే ప్రాణవాయువును పీల్చి బతికే జలచరాల మనుగడే ప్రశ్నార్థకమంగా మారే ప్రమాదముంది. ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘సైన్సెస్ అడ్వాన్సెస్’జర్నల్‌లో శుక్రవారం ప్రచురితమయ్యాయి. ఆమ్లజని గాఢత తగ్గుతూ పోతే వచ్చే శతాబ్దంచివరినాటికి తూర్పు అమెరికా మొదలు భారత్ దాకా ఉష్ణమండల ప్రాంతాలు దేశాల్లో నదుల్లో చేపల వంటి జలచరాల సంఖ్య దారుణంగా పడిపోతాయి.
అప్పుడు నదీజలాల్లో వెతికినా ఒక్క చేప కూడా దొరకదని అధ్యయనం ముందస్తు ప్రమాదఘంటికలు మోగించింది. సాధారణంగా భౌతిక, రసాయన శాస్త్ర భావనల ప్రకారంచూసినా వేడి నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మానవప్రేరేపిత వాతావరణ మార్పుల ప్రభావం అతిగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో ఆయువు పోయాల్సిన ఆమ్లజనికి మనిషే స్వయంగా ఆయువు తీస్తున్నాడని నివేదిక ఘాటు వ్యాఖ్యలుచేసింది. ప్రస్తుతమున్న క్షీణతరేటును పరిగణనలోకి తీసుకుంటే ఈ శతాబ్దంచివరినాటికి నదుల్లో ఆక్సిజన్ 5 శాతం తగ్గిపోయే అవకాశముంది.
నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం
మత్స్యకారులకు, మత్స్యసంబంధ వృత్తులతో జీవనం సాగించే జనాభాకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో కీలక రచయిత, నంజియాంగ్ సిటీలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఎన్విరాన్‌మెంటల్ విభాగ శాస్త్రవేత్త క్వీ గువాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘నదుల్లో ఆక్సిజన్ తగ్గిపోతే దానిని డీఆక్సిజనరేషన్‌గా పిలుస్తాం. ఇది చేపల సంతతిపై, వాటి మనుగడపై దుష్ట్రభావం చూపిస్తుంది. నాణ్యమైన ఆక్సిజన్ లేకపోతే జలచరాల ఉనికి ప్రమాదంలో పడుతుంది.
చేపలు, రొయ్యలు, ఇతరత్రా చలజరాల దిగుబడి తగ్గిపోతే మత్స్యకారులతోపాటు మత్స్యరంగం అభివృద్ధి సైతం కుంటుబడుతుంది. ఇది పరోక్షంగా ఆయా దేశాల జీడీపీపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆక్సిజన్ క్షీణతరేటు విపరీతంగా పెరిగిపోతే నదీమతల్లులు చివరకు జలచరాల మృత్యుకుహరాలుగా రూపాంతరంచెందుతాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, చీసాపీక్ బే, లేక్ ఎరీ లాంటి ప్రాంతాల్లో చేపలు కనీసం శ్వాసించే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు మత్స్యసంపదకు ఆలవాలమైన ప్రాంతాలన్నీ డెడ్ జోన్‌లుగా మిగిలిపోతాయి’’అని శాస్త్రవేత్త హెచ్చరించారు.
గంగానది మరింత దారుణం
‘‘పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సగటు మరింత పెరుగుతున్న ఈ రోజుల్లో గంగానదిలో ఆక్సిజన్ పాళ్లు ఏకంగా 20 రెట్లు ఎక్కువ వేగంతో క్షీణిస్తున్నాయి. తూర్పు అమెరికా, ఆర్కిటిక్, భారత్, దక్షిణ అమెరికాలోని నదుల్లో ఈ శతాబ్దం చివరినాటికి ఆక్సిజన్ దాదాపు 10 శాతం క్షీణించనుంది. బ్రెజిల్‌లోని అమెజాన్ వంటి ఉష్ణమండల నదుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1980 నుంచి చూస్తే అమెజాన్ నదిలో ఆక్సీజన్‌లేని డెడ్‌జోన్ ప్రాంతాల్లో రోజుల సంఖ్య ప్రతి దశాబ్దానికి అదనంగా 16 రోజులు పెరుగుతూ పోతోంది’’అని శాస్త్రవేత్త క్వీ గువాన్ తెలిపారు. అందరి ఆయువును నిలబెట్టే ఆక్సీజన్‌ను నదుల్లో నిలుపుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని శాస్త్రవేత్తలు హితబోధచేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


