బిడ్డను వదల్లేక రైలెక్కిన మహిళ జవాన్‌.. సెల్యూట్‌ అంటూ నెటిజన్ల ప్రశంస!

Bsf Jawan Varsha Rani Left Her 10 Month Old Baby To Protect Country - Sakshi

కన్న తల్లి తన బిడ్డలను ఎంత అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటుందో అందరికీ తెలుసు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తల్లి తన బిడ్డలను వదిలిపెట్టదు. కానీ, దేశ రక్షణలో భాగంగా తన కర్తవ్య నిర్వహణలో భాగంగా ఓ తల్లి తన 10 నెలల పసికందును విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తన బిడ్డను భర్త, కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ కన్నీరు పెట్టుకుంది. పేగుబంధాన్ని విడిచి వెళ్లలేక బరువైన గుండెతో వెక్కివెక్కి ఏడుస్తూ విధులకు బయలు దేరింది. ఈ ఘటనను చూసి అక్కడున్న వారంతా ఆవేదనకు లోనయ్యారు. 

వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కర్వీర్ తాలూకా నంద్‌గావ్‌కు చెందిన వర్షా రాణి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్‌గా పని చేస్తోంది. పది నెలల కిందటే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పది నెలల పాటు ఆమె తన బిడ్డ ఆలనా పాలనా చూస్తూ ఎంతో సంతోషంగా కాలం గడిపింది. ఇక, మళ్లీ ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయం రావడంతో విధులకు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన బిడ్డను వదిలి డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు ఆమె సిద్ధమైంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌కు బయలుదేరింది. 

డ్యూటీకి వెళ్లాలనే కోరిక ఏ మాత్రం లేకపోయినప్పటికీ బలవంతంగా రైలు ఎక్కింది. తన బిడ్డను భర్త చేతుల్లో పెడుతూ భావోద్వేగం ఆపులేక బోరున ఏడ్చేసింది. బిడ్డను వదల్లేక కన్నీళ్లు పెట్టుకుంది. భర్తను, తల్లిదండ్రులను కౌగలించుకుని ఏడ్చేసింది. అనంతరం అందర్నీ వదిలి రైలెక్కింది. రైలు కదులుతున్నా ఆమె డోర్ దగ్గరే నిల్చుని బిడ్డను చూస్తూ కన్నీటితో వీడ్కోలు పలికింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top