తిక్క కుదిరింది.. కీలెరిగి వాత పెట్టిన న్యాయమూర్తి! | Court Postpones 90 Year Old Woman Defamation Case To 2046 After Refusal To Settle, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

తిక్క కుదిరింది.. కీలెరిగి వాత పెట్టిన న్యాయమూర్తి!

Apr 29 2026 12:15 PM | Updated on Apr 29 2026 12:44 PM

Bombay High Court judge defamation suit Case adjourned to 2046

‘ఉత్తమే క్షణ కోపస్యాత్.. మధ్యమం ఘటికాద్వయం.. అథమస్య అహోరాత్రం.. పాపిష్టే మరణాంతకం’ అని ఆర్యోక్తి. కోపం విషయంలో మనం దానిని ఎంత కాలం కలిగి ఉండాలి.. కోపాన్ని విడిచిపెట్టి ఎంత త్వరగా మనం సానుకూల వైఖరిలోకి వస్తాం అనే దానిని బట్టి.. మన వ్యక్తిత్వాన్ని అంచనా వేసి చెప్పే మాట ఇది. ఉత్తములకు కోపమొస్తే క్షణమే ఉంటుందట.. మధ్యములకు రెండు ఘడియలు ఉంటుందట. అథములకు ఒక పగలు ఒక రాత్రి వరకు ఉంటుందట. పాపిష్టి వాళ్లకైతే చచ్చేదాకా ఆ కోపం కంటిన్యూ అవుతుందట. అంటే, కోపం విషయంలో మనం ఎంత త్వరగా దానిని మరచిపోగలిగితే అంత మంచిది అని ఈ సుభాషితం చెబుతుంది.

ముంబైకి చెందిన తరిణిబెన్ దేశాయ్ రచయిత్రే గానీ.. బహుశా ఆమె ఈ శ్లోకం గురించి తెలుసుకుని ఉండకపోవచ్చు. తెలిసినా ఈ శ్లోకం చెప్పే నీతి ఆమెకు రుచించి ఉండకపోవచ్చు. అందుకే తమ హౌసింగ్ సొసైటీ వాళ్ల మీద వచ్చిన కోపాన్ని రోజుల్లో మరచిపోకుండా.. పదేళ్లుగా హైకోర్టులో దావా నడుపుతోంది. ఆమెకు తొంభయ్యేళ్లు వచ్చాయి గానీ.. ఇంకా కోపం తగ్గలేదు. ఇప్పట్లో కోపాన్ని విడిచిపెట్టను అని కూడా ఆమె సంకేతం ఇచ్చింది. అందుకే న్యాయమూర్తికి కూడా కోపం వచ్చి.. చిత్రమైన ఆదేశం ఇచ్చాడు. అహంభావంతో న్యాయమూర్తి చెప్పిన పరిష్కారాన్ని పట్టించుకోకుండా వ్యవహరించిన ఆమెకు తెలిసొచ్చేలా ఆ ఆదేశం ఉంది.

ఆదేశం గుణపాఠమే.. ఎందుకని? 
ఈ కేసు ఇప్పుడు మొదలు కాలేదు. 2017 నాటిది. అంటే దాదాపు పదేళ్ల కిందట మొదలైంది. ముంబై మలబార్ హిల్స్ లోని ఒక హౌసింగ్ సొసైటీలో అప్పట్లో మరమ్మతులు చేపట్టారు. ఆ వ్యవహారంపై రచయిత్రి తరిణిబెన్ దేశాయ్, ఆమె కుమార్తె ధ్వని కలిసి హౌసింగ్ సొసైటీ సభ్యుల మీద హైకోర్టులో పరువునష్టం దావా  వేశారు. ఇన్నాళ్లుగా విచారణ సాగుతూనే ఉంది. ఈ విషయం ప్రతివాదులు కేవలం ‘మన్నింపు’ కోరితే సరిపోతుందని.. కేసు నడపవలసిన అవసరం లేదని హైకోర్టు న్యాయమూర్తి జితేంద్ర జైన్ సూచించారు. కానీ దావా వేసిన తరిణి బెన్ దేశాయ్ అందుకు అంగీకరించలేదు. దావా నడిపి తీరాల్సిందే అని పట్టుబట్టారు. దాంతో అసహనానికి గురైన న్యాయమూర్తి జితేంద్ర జైన్ వారికి గుణపాఠం లాంటి తీర్పు చెప్పారు. ఈ దావా తదుపరి విచారణను 20 ఏళ్ల తర్వాతకు వాయిదా వేశారు.

కేవలం ఇప్పట్లో దానిని మళ్లీ విచారించే పరిస్థితి తనకు ఎదురుకాకుండా ఉండేందుకే ఆయన వాయిదా వేశారు. కానీ తీర్పులో ఇంకా చాలా ఘాటుగానే పేర్కొన్నారు. పిటిషనర్లు సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు అనే సానుభూతితో దానిని ముందుగా హియరింగ్ కోసం లిస్ట్ చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2046కు ముందు హియరింగ్ తీసుకురావొద్దని తేల్చేశారు. పరువునష్టం పిటిషన్ వేసిన తరిణిబెన్ దేశాయ్ వయసు ఇప్పుడు 90 ఏళ్లు. మరో ఇరవై ఏళ్ల తర్వాత దావాకు హాజరై తన పంతం నెగ్గించుకోవాలంటే, తన అహం చల్లార్చుకోవాలంటే.. ఆమె 110 ఏళ్ల వయసు వరకు జీవించి ఉండాలి. కీలెరిగి వాతపెట్టడం అంటే ఇదే!.

Advertisement
 
Advertisement
Advertisement