మమత సర్కారుపై బీజేపీ చార్జిషీట్
15 ఏళ్లుగా అసమర్థ పాలన: అమిత్ షా
చొరబాట్లకు కేంద్రంగా మార్చారని నిప్పులు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనలో పశ్చిమబెంగాల్ అన్ని రంగాల్లోనూ తీవ్ర వెనకబాటుకు గురైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. ‘‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం ము స్లిం సంతుష్టీకరణ రాజకీయాలు, అవినీతి, రాజకీయ హింసనే నమ్ముకున్నారు. రాజకీ యంగా ఎదిగేందుకు, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అబద్ధాలు, హింసనే నమ్ముకు న్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లకు బెంగాల్‌ను ప్రధాన ద్వారంగా మార్చారు’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆ అక్రమాల న్నింటికీ బీజేపీ అడ్డుకట్ట వేసి తీరుతుందన్నారు.
మమత సర్కారు తీరుపై పలు అభి యోగాలతో చార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శనివారం కోల్‌కతాలో ఆయన మీడియాతో మాట్లాడారు. మమత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని తూర్పారబట్టారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను జాతీయ భద్రత కోసం జరుగుతున్న పోరాటంగా అభిర్ణించారు. 15 ఏళ్లుగా రాష్ట్రంలో భయోత్పాతంతో కూడిన పాలన సాగింది. ఈ ఎన్నికలు ఆ భయోత్పాతానికి, విశ్వాసానికి నడుమ జరుగుతున్న పోరాటం. మమత సర్కారు అసమర్థ పాలన, అవినీతి, రాజకీయ హింస, సంతుష్టీకరణ రాజకీయాలు, అక్రమ చొరబాట్లతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా ఫెన్సింగ్, ఓటర్ల జాబితా ప్రక్షాళన కూడా ప్రధాన ప్రచారాంశాలుగా ప్రజల్లోకి వెళ్తాం’’ అని ప్రకటించారు.
దేశానికే ముప్పుగా చొరబాట్లు
బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్ గుండా దేశంలోకి సాగుతున్న చొరబాట్లు జాతీయ భద్రతకే సవాలుగా పరిణమిస్తున్నాయని అమిత్ షా ఆందోళన వెలిబుచ్చారు. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట పడిందని ఆయన చెప్పారు. ‘‘ప్రస్తుతం చొరబాట్లకు బెంగాల్ ఏకైక మార్గంగా మిగిలిందంటే మమత సంతుష్టీకరణ రాజకీయాలే అందుకు కారణం. వాటివల్ల వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ భద్రతే పెను ప్రమాదంలో పడింది. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక్క బెంగాల్‌కు మాత్రమే గాక దేశమంతటికీ చాలా కీలకంగా మారాయి. ఒకరకంగా దేశ భద్రతే ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది’’ అని చెప్పారు.
‘‘కేంద్రం ఎన్నిసార్లు కోరినా బంగ్లాదేశ్ సరిహద్దులను ఫెన్సింగ్‌తో బలోపేతం చేసేందుకు భూమి కేటాయించేందుకు మమత ససేమిరా అన్నారు. చొరబాటు దారులతో తృణమూల్ ఓటుబ్యాంకును బలోపేతం చేసుకోవాలన్న దురాలోచనే ఇందుకు ఏకైక కారణం’’ అని అమిత్ షా ఆరోపించారు. ‘‘బెంగాల్ ప్రజలను ఒక్కటే అడగదలచుకున్నా. చొరబాటుదారులకు ఓటటుహక్కు ఇవ్వాలా?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రతి చొరబాటుదారు ఓటునూ తొలగించి తీరతాం. అంతేకాదు, వాళ్లలో ప్రతి ఒక్కరినీ దేశం నుంచే వెళ్లగొడతాం’’ అని స్పష్టం చేశారు.
‘‘బెంగాల్‌లో మమత అరాచక పాలనకు బీజేపీ అడ్డుకట్ట వేస్తుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మే 6న రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత 45 రోజుల్లోనే సరిహద్దుల గుండా ఫెన్సింగ్‌కు అవసరమైన భూమిని కేంద్రానికి అప్పగిస్తాం. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి చొరబాట్లకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తాం’’ అని ప్రకటించారు. చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా అంగ (బిహార్), వంగ (బెంగాల్), కళింగ (ఒడిశా) ఒకే పార్టీ పాలనలోకి రానున్నాయని జోస్యం చెప్పారు.
మైనారిటీ ఓట్ల కోసమే ‘సర్’ డ్రామా
ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై మమత వ్యతిరేక తను అమిత్ షా తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘ఈసీపై విమర్శలు చేయడం బెంగాలీ సంస్కృతిలో భాగం కానే కాదు. కేవలం మైనా రిటీల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే మమత ఇలా రాద్ధాంతం చేశారు’’ అని ఆరో పించారు. దేశంలో విపక్షాల పాలనలో ఉన్న మరే రాష్ట్రంలోనూ సర్ ప్రక్రియపై వివాదాలు తలెత్తలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేయడాన్ని అమిత్ షా సమర్థించారు. వారిలో పలువురు అచ్చం తృణమూల్ కార్యకర్తల్లా వ్యవహరించారని ఆరోపించారు. ఆ బదిలీల తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు.
బాధితురాలి కార్డు
‘విక్టిమ్ కార్డు’ రాజకీయాలను మమత అలవాటుగా మార్చుకున్నారంటూ అమిత్ షా దుయ్యబట్టారు. ‘‘ప్రజల్లో సానుభూతి పొందేందుకు బాధితురాలి కార్డు ప్రయోగించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. తనకు చిన్న గాయమైనా దానిపై విపరీతంగా ప్రచారం చేయించుకుంటారు. అవినీతి తదితర సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నికల సంఘంపై ఇష్టానికి విమర్శలు చేస్తారు. వీటిని బెంగాల్ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. మమత విక్టిమ్ కార్డు పాచిక ఇకపై పారబోదు’’ అని స్పష్టం చేశారు.


