కోల్‌కతా: బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్‌పై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. శనివారం రాష్ట్రంలో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా.. టీఎంసీ ప్రభుత్వ పదిహేనేళ్ల పరిపాలనా వైఫల్యాలను ఎండగట్టారు. బెంగాల్ అవినీతి ప్రయోగశాలగా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. చొరబాటు దారులకు బెంగాల్ అడ్డాగా ఉందని.. బెంగాల్‌లో శాంతి భద్రతలు క్షీణించాయన్న అమిత్ షా.. మమత పాలనలో అరాచకం రాజ్యమేలుతోందంటూ దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే(బెంగాల్) పరిమితం కాదని.. దేశ భద్రతతో ముడిపడి ఉన్నాయని.. అందుకే అత్యంత కీలకమంటూ వ్యాఖ్యానించారు.
గత 15 ఏళ్ల పాలనలో పశ్చిమ బెంగాల్ చొరబాట్లకు, బుజ్జగింపు రాజకీయాలకు, సరిహద్దు అభద్రతకు ప్రధాన కారిడార్‌గా మారిందని షా ఆరోపించారు. కేంద్రం పదేపదే కోరినప్పటికీ, సరిహద్దు కంచె ఏర్పాటుకు మమతా బెనర్జీ ప్రభుత్వం భూమిని కేటాయించలేదని అంటూ ఆయన విమర్శించారు. చొరబాటుదారులతో ఓటు బ్యాంకును సృష్టించుకోవడమే వారి లక్ష్యమంటూ ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలను భయం- విశ్వాసం మధ్య జరుగుతున్న పోరాటంగా అమిత్ షా అభివర్ణించారు. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ అబద్ధాలు, హింస, అవినీతి రాజకీయాలను పెంచి పోషించారు. ఈసారి బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే పరివర్తన్ ర్యాలీల పేరిట ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ.. మమత సర్కారు వైఫల్యాలపై బహిరంగ సభలు, చిన్న స్థాయి భేటీల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఛార్జ్‌షీట్ పేరుతో ప్రజలను మరింతగా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అవినీతి–కుంభకోణాలు, పరిపాలనా వైఫల్యాలు, శాంతిభద్రతల పతనం, మహిళలపై నేరాలు– భద్రతా లోపాలు, ప్రజాస్వామ్యంపై దాడులు, పారిశ్రామిక, విద్య, ఆరోగ్య రంగాల క్షీణత, రైతు సమస్యలు, తేయాకు తోట కార్మికుల దుస్థితి, కోల్‌కతా నగర పరిస్థితి, ‘సిండికేట్ రాజ్’వంటివి ఇందులో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేస్తామని బీజేపీ వర్గాలు తెలిపాయి.



