పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి సమంతరాయ్ రాజీనామా
భువనేశ్వర్: నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్‌కు మరో గట్టిదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్ సోమవారంనాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నవీన్ పట్నాయక్‌కు పంపారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి, రాజ్యసభ సభ్యత్వానికి తన రాజీనామాను సమరి్పంచారు.
బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌కు దీర్ఘకాల సహచరుడైన సమంతరాయ్, త్వరలో బీజేపీలో చేరతానని ప్రకటించారు. పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని, బీజేడీ అధినేతను కలవకుండా తనను అడ్డుకున్నారని సమంతరాయ్ ఆరోపించారు. 2024 ఎన్నికలలో పార్టీ ఓటమికి మాజీ బ్యూరోక్రాట్, రాజకీయవేత్త అయిన వీకే పాండియన్ కారణమని ఆయన విమర్శించారు.
‘నేను బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఇటీవల, పార్టీలో నన్ను తక్కువ చేసి చూస్తున్నారు. నా సేవలు పార్టీకి అవసరం లేదని భావించాను. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను. నా రాజీనామాను ఆమోదించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’అని పట్నాయక్‌కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు ఎగువ సభకు తనను నామినేట్ చేసినందుకు పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
పాండియన్‌పై ఆరోపణలు
ఏప్రిల్ 2024లో రాజ్యసభకు ఎన్నికైన సమంతరాయ్, పాండియన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 2024 లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఓటమి పాలైన తర్వాత, పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే క్రియాశీల రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ, పాండియన్ తెరవెనుక ఉండి పార్టీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తూనే ఉన్నారని సమంతరాయ్ పదేపదే ఆరోపించారు. గతేడాది నవంబర్‌లోనే బీజేడీ సీనియర్ సిటిజన్స్ విభాగం ఉపాధ్యక్ష పదవికి సమంతరాయ్ రాజీనామా చేశారు. ఆ సమయంలో, పార్టీ పనితీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ ఆశయాలు, సిద్ధాంతాలకు దూరమైపోయిందని ఆరోపించారు.
వ్యాపార ప్రయోజనాల కోసమే : బీజేడీ
సమంతరాయ్ రాజీనామా పార్టీకి ఒక ఎదురుదెబ్బనే అభిప్రాయాన్నీ బీజేడీ తోసిపుచ్చింది. ఆయన నిష్క్రమణ కటక్ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది. ఆయన ప్రజాసేవకు కాకుండా వ్యాపారం కోసమే రాజకీయాల్లోకి వచ్చారని, తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికే పార్టీని వీడార ప్రతిపక్ష చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ అన్నారు. అధికారంలో ఉండగా పార్టీ నుంచి అన్ని రకాల ప్రయోజనాలను పొందిన ఆయన, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని వీడి వెళ్లిపోయారని విమర్శించారు. బీజేపీ ఆయనను ప్రధానమంత్రిని గానీ, భారత రాష్ట్రపతిని గానీ చేయవచ్చేమోనని ఎద్దేవా చేశారు. ఇద్దరు రాజ్యసభ ఎంపీలు సుజీత్ కుమార్, మమతా మహంత పార్టీని వీడిన కొన్ని నెలల తర్వాత సమంతరాయ్ రాజీనామా చేయడం గమనార్హం.


