Bilateral Talks: జపాన్‌తో బంధం బలోపేతం

Bilateral Talks: PM Narendra Modi holds talks with Japanese counterpart Fumio Kishida - Sakshi

కిషిదా, మోదీ చర్చలు

న్యూఢిల్లీ: భారత్‌–జపాన్‌ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు ప్రతినబూనారు. ఈ మేరకు రెండు దేశాల అగ్రనేతలు ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని ప్యుమియో కిషిదాలు సోమవారం ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 27 గంటల భారత పర్యటనలో భాగంగా కిషిదా ఢిల్లీకొచ్చిన విషయం తెల్సిందే. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలతోపాటు ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిర, స్వేచ్ఛాయుత వాతావరణం పరిడవిల్లేలా చూసేందుకే ద్వైపాక్షిక చర్చలు సాగించినట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు.

ఇండో– పసిఫిక్‌ ప్రాంతాన్ని తన ఆధిపత్య నీడలోకి తెచ్చేందుకు సాహసిస్తున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు, ఉక్రెయిన్‌ యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న అంతర్జాతీయ సమాజంలో శాంతి స్థాపనకు తమ వంతు కృషిచేసేందుకు జపాన్, భారత్‌లు ముందుకొచ్చినట్లు నేతలు తెలిపారు. ‘ జీ20 సదస్సుకు భారత్, జీ7 కూటమికి జపాన్‌ అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణం ప్రపంచ శ్రేయస్సు కోసం చేసే కృషికి చక్కని అవకాశం. జీ20 అధ్యక్షతన భారత ప్రాధాన్యాలను కిషిదాకు వివరించా. భారత్‌–జపాన్‌ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రపంచ చట్టాలను గౌరవిస్తూ ఏర్పడిందే.

ఇండో–పసిఫిక్‌ ప్రాంతానికి ఇదెంతో ముఖ్యం. రక్షణ, డిజిటల్‌ సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, సెమీ కండక్టర్ల సరఫరా గొలుసు, సంక్షిష్ట సాంకేతికత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలపేతంపై మేం సమీక్ష చేశాం’ అని తర్వాత పత్రికా ప్రకటనలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘ భారత్‌తో ఆర్థిక తోడ్పాటు గణనీయంగా పెరుగుతోంది. ఇది భవిష్యత్‌ వృద్ధికేకాదు జపాన్‌ ఆర్థిక అవకాశాలకు ఎంతగానో ఊతమిస్తుంది. స్వేచ్ఛాయుత ఇండో –పసిఫిక్‌ విధానాన్ని నేడు భారత గడ్డపై మోదీ సమక్షంలో ఆవిష్కరించా. మేలో జరిగే జీ7 సదస్సుకు మోదీని సాదరంగా ఆహ్వానించా’ అని ప్యుమియో కిషిదా చెప్పారు.

పలు ఒప్పందాలపై సంతకాలు
ఇరు దేశాలపై ఉక్రెయిన్‌ యుద్ధ విపరిణామాల ప్రభావం, ఇండో–పసిఫిక్‌ పరిస్థితి, సైనిక హార్డ్‌వేర్‌ను ఉమ్మడి అభివృద్ధి చేయడం వంటి కీలకాంశాలూ చర్చకొచ్చాయి. ముంబై–అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కోసం జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ నుంచి నాలుగో విడత 300 బిలియన్‌ యెన్‌ల(రూ.18,800 కోట్ల) రుణానికి సంబంధించిన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top