అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీగా ఈపీఎస్‌.. మద్రాస్‌ హైకోర్టులో పన్నీర్‌ సెల్వంకు భారీ షాక్‌

Big Win For AIADMK EPS At Madras High Court - Sakshi

తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేలో వర్గ పోరులో.. కోర్టు తీర్పు ద్వారా పళనిస్వామి మళ్లీ పైచేయి సాధించారు. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో పాటు ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ పన్నీర్‌సెల్వం మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఇవాళ(మంగళవారం) ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. 

మద్రాస్‌ హైకోర్టు తీర్పు వెలువడినవెంటనే.. అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా ఈపీఎస్‌(ఎడపాడి కే పళనిస్వామి)ని పార్టీ ప్రదాన కార్యదర్శిగా ప్రకటించింది పార్టీ సీఈసీ. ఈ మేరకు చెన్నైలోని పార్టీ  ప్రధాన కార్యాలయం వద్ద సంబురాలు జరుగుతున్నాయి. ఇక తాజా తీర్పుతో ఓపీఎస్‌(ఓ పన్నీర్‌ సెల్వం).. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌ను ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ఇక.. అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి (తాత్కాలిక) పదవికి పళనిస్వామి నియామకాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్‌ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కిందటి ఏడాది జులైలో పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ ద్వారా ఈ నియామకం జరగ్గా.. దానిని వ్యతిరేకిస్తూ పన్నీర్‌ సెల్వం వర్గం న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్‌ను చట్టబద్ధమైనదిగానే సమర్థించింది. అయితే తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం మాత్రం మద్రాసు హైకోర్టుకు వదిలివేసింది.

ఇదిలా ఉంటే.. గత శనివారం పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవి ఎన్నికకు ఈపీఎస్‌ నామినేషన్‌ దాఖలు చేయగా.. ఇదంతా దొంగచాటు వ్యవహారమంటూ పన్నీర్‌సెల్వం మండిపడ్డారు. అంతలోనే మద్రాస్‌ హైకోర్టు ఈపీఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం గమనార్హం.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top