అస్సాం అసెంబ్లీలో యూసీసీ బిల్లు  | Assam government introduced the Uniform Civil Code bill in the assembly | Sakshi
Sakshi News home page

అస్సాం అసెంబ్లీలో యూసీసీ బిల్లు 

May 26 2026 4:27 AM | Updated on May 26 2026 4:27 AM

Assam government introduced the Uniform Civil Code bill in the assembly

బహుభార్యత్వం రద్దు 

సహజీవన భాగస్వామ్యాలకు రిజిస్ట్రేషన్లు 

ప్రతిపాదించిన బీజేపీ ప్రభుత్వం 

గువాహటి: బహుభార్యత్వంపై నిషేధం, సహజీవన భాగస్వామ్యాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి వంటి ప్రతిపాదనలతో కూడి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)బిల్లును అస్సాం ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఒకరికి మించి భార్యలను కలిగి ఉండేవారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, సహజీవనాలను ముందుగా నమోదు చేయించుకోకుంటే మూడు నెలల కారాగారానికి వీలు కల్పిస్తూ ఇందులో నిబంధనలను పొందుపరిచారు. కనీస వివాహ వయస్సును పురుషులైతే 21 ఏళ్లు, మహిళలయితే 18ఏళ్లుగా ప్రతిపాదించారు. 

అయితే, ఇవేవీ రాష్ట్రంలో నివసించే షెడ్యుల్డ్‌ తెగల వారికి వర్తించవని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అతుల్‌ బోరా బిల్లును ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం వంటి అంశాల్లో చట్టాల ఏకీకృతం, సరళీకృతమే తమ లక్ష్యమని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బిల్లుపై కాంగ్రెస్, టీఎంసీ, రైజోర్‌ దళ్‌ వంటి పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రతిపాదిత అంశాలపై ముందుగా అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపాలని డిమాండ్‌ చేశాయి. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో అస్సాం యూసీసీ కూడా ఒకటి. బిల్లుపై బుధవారం చర్చ జరిగే అవకాశముంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement