Viral Video: నగదు లేకున్నా పర్లేదు పేటీఎం చెయి! ఫొటోలు బయటపడటంతో ఉద్యోగం గోవిందా!

Allahabad High Court Staff Uses QR Code To Collect Tips Suspended Viral - Sakshi

ప్రపంచమంతా డిజిటల్‌మయమవడంతో ‘చిల్లర’కు కొరత ఏర్పడింది. చిన్నాపెద్దా అని తేడా లేకుండా ఎంత మొత్తమైనా ఆన్‌లైన్‌లో చెల్లించేస్తున్నారు చాలామంది. మామూలుగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేక సేవలు పొందినప్పుడు డబ్బులు ఆన్‌లైన్‌ చెల్లింపు యాప్‌ల ద్వారా చేయడం తెలిసిందే. కానీ, ‘మామూలు’ కూడా ఆన్‌లైన్‌గా మారడం ఇక్కడ ప్రత్యేకం. అలహాబాద్‌ హైకోర్టులో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

హైకోర్టుకు పనుల నిమిత్తం వచ్చే లాయర్ల వద్ద అక్కడ పనిచేసే జమాదార్‌ (బండిల్స్‌ ఎత్తేవాడు) ‘టిప్పు’ వసూలు చేసేవాడు. అయితే, ఇటీవల కాలంలో చాలామంది చెల్లింపులు ఆన్‌లోనే చేస్తున్నారు. అందువల్ల చిన్న నోట్ల కరెన్సీకి కొరత ఏర్పడింది. దీంతో జమాదార్‌ రాజేంద్ర కుమార్‌ ఆన్‌లైన్‌ సేవలను వాడుకోవాలనుకున్నాడు. నగదు లేకుంటే పేటీఎం ద్వారా చెల్లించినా సరేనంటూ వాళ్లకు ఆఫర్‌ ఇచ్చాడు. అంతేకాకుండా పేటీఎం క్యూ ఆర్‌ కోడ్‌ను ఏకంగా యూనిఫారంకు తగిలించుకుని కోర్టు విధులకు హాజరయ్యాడు.

కానీ, ఈ తతంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో విషయం వెలుగుచూసింది. రాజేంద్ర కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు జడ్జి జస్టిస్‌ అజిత్‌ సింగ్‌ ప్రధాన న్యాయమూర్తి రాజేష్‌ బిందాల్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టగా విషయం నిజమేనని తేలింది. దీంతో రాజేంద్ర కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

సాధారణంగా కేసులో విజయం సాధించిన లాయర్లు జమాదార్‌కు కొంత చిల్లర టిప్పుగా ఇస్తారని కొందరు హైకోర్టు ఉద్యోగులు చెప్పుకొచ్చారు. కానీ, రాజేంద్ర కుమార్‌ కోర్టు పరిసరాల్లో, అది కూడా యూనిఫాంకు పేటీఎం స్టికర్‌ను అంటించుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు.

(చదవండి: వీడియో కాల్‌తో విపత్తు.. ఫోన్‌ లిఫ్ట్‌ చేశామో పోర్న్‌ చిత్రాలతో ఎడిట్‌ చేసి..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top