Agnipath Recruitment: అగ్నిపథ్‌లో ‘కుల’కలం?

Agnipath Recruitment Opposition Slams Centre For Asking Caste - Sakshi

కుల, మత సర్టిఫికెట్లు అడుగుతున్న సైన్యం: విపక్షాలు

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ నియామకాలకు సైన్యం కులాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుంటోందన్న వార్తలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను సైన్యం కులం, మతం సర్టిఫికెట్‌ అడుగుతోందని విపక్షాలు మంగళవారం ఆరోపించాయి. అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) కూడా వాటితో గొంతు కలిపింది. వీటిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఖండించగా, సైన్యం వద్ద ఇలాంటి సమాచారముంటే సైనికుల అంత్యక్రియల వంటి సమయంలో సహాయకారిగా ఉంటుందంటూ అధికార బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా స్పందించడం విశేషం!

అగ్నిపథ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిని కులం, మతం సర్టిఫికెట్లు జతపరచాలని అడుగుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌తో పాటు అధికార ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీ(యూ) నేత ఉపేంద్ర కుశ్వాహా కూడా ఆరోపించారు. బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా కులమతాలను అడగాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ట్వీట్‌ చేశారు. బీసీలు, దళితులు, గిరిజనులు సైన్యంలో చేరేందుకు అనర్హులని ప్రధాని మోదీ భావిస్తున్నారా అని సంజయ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు.

తప్పుడు ప్రచారం..
ఇదంతా పూర్తిగా తప్పుడు ప్రచారమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. సైన్యంలో స్వాంతంత్య్రానికి ముందునుంచీ వస్తున్న నియామక పద్ధతులే కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఎలాంటి మార్పులూ చేయలేదని రాజ్యసభలో స్పష్టం చేశారు. సైన్యంపై వివాదాలు పుట్టించే ప్రయత్నాలు విపక్షాలకు పరిపాటేనన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ను ఆప్‌ చీఫ్‌ కేజ్రివాల్‌ అనుమానించడాన్ని గుర్తు చేశారు. నియామకాల్లో కులమతాలను ఏ విధంగానూ పరిగణనలోకి తీసుకోవడం జరగదంటూ 2013లో యూపీలో హయాంలో సుప్రీంకోర్టులో సైన్యం అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది.

ఇదీ చదవండి: IAF Agnipath Recruitment 2022: భారత వాయుసేనలో ‘అగ్నిపథ్‌’ రిక్రూట్‌మెంట్‌ షురూ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top