తొలిసారిగా.. 45 ఏళ్ల రాజకీయ చరిత్రకు బ్రేక్‌, కుటుంబానికి నో టికెట్‌

After 45 Years Azam Khan Family Distance To Rampur By Poll - Sakshi

మోరాదాబాద్‌: ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రామ్‌పూర్‌ అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికలకు మొట్టమొదటిసారిగా సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత అజామ్‌ ఖాన్‌, ఆయన కుటుంబం దూరం అయ్యింది. 1977 నుంచి ఈ నియోజకవర్గం ఖాన్‌ ఇలాకాగా రామ్‌పూర్‌ విరజిల్లుతోంది. అయితే..

విద్వేషపూరిత ప్రసంగం కేసులో.. తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి మూడేళ్ల శిక్ష పడింది అజామ్‌ ఖాన్‌కి. దీంతో.. ఆయన శాసన సభ సభ్యత్వం కోల్పోవడంతో రామ్‌పూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్‌ 5వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్‌ 8వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. అయితే.. 

సమాజ్‌వాదీ పార్టీ నుంచి అజామ్‌ ఖాన్‌ భార్య తంజీన్‌ ఫాతిమాగానీ, ఆయన కోడలుగానీ బరిలో దిగుతారని అంతా భావించారు. కానీ, ఎస్పీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అసీమ్‌ రజా ఖాన్‌కు టికెట్‌ కేటాయించింది. రజా ఖాన్‌, అజామ్‌ ఖాన్‌ను అత్యంత సన్నిహితుడు. గతంలో ఆజామ్‌ ఖాన్‌ తన పార్లమెంట్‌ స్థానానికి రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థిగా రజా ఖాన్‌ పోటీ చేశారు. అయితే.. బీజేపీ ఘనశ్యామ్‌ లోథి చేతిలో ఓడిపోయారు.

రామ్‌పూర్‌ నియోజక వర్గానికి 1997 నుంచి 2022 దాకా మొత్తం 12 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో.. పదిసార్లు ఆయన గెలుపొందారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. 

గతంలో అజామ్‌ ఖాన్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన సమయంలో ఉప ఎన్నిక జరగ్గా.. ఆ సమయంలో ఆయన భార్య తంజీన్‌ ఫాతిమా పోటీ చేసి.. గెలుపొందారు. కానీ, ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు సమాజ్‌వాదీ పార్టీ మొండి చేయి చూపించింది. అజామ్‌ ఖాన్‌తో పాటు ఆయన కుటుంబం న్యాయపరమైన కేసులు ఎదుర్కొంటోంది. 2014లో అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వంలో ఆజామ్‌ ఖాన్‌ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే కుట్రకు పాల్పడిన అభియోగాలపై ఆజామ్‌ ఖాన్‌ భార్య, ఆయన తనయుడిపై కేసు నమోదు అయ్యింది కూడా.

ఇక బీజేపీ తరపున ఇక్కడ ఆకాశ్‌ సక్సేనా బరిలో నిలవనున్నారు. ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆకాశ్‌ పోటీ చేసి.. ఆజామ్‌ ఖాన్‌ చేతిలో ఓడిపోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top