బెయిల్‌ మంజూరు, కాసేపటికే దీప్‌ సిద్దూ మళ్లీ అరెస్ట్‌

Actor Deep Sidhu Gets Bail And Arrested Again - Sakshi

న్యూఢిల్లీ : పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్దూకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌‌ మంజూరు చేసిన కొద్ది గంటల్లోనే పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా నెలకొన్న హింసకు సంబంధించి భారత పురావస్తు శాఖ (ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు దీప్‌ సిద్ధును శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నవంబర్‌ నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 26న రైతు సంఘాలు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాయి.

ఈ ర్యాలీలో రైతులను నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఎర్రకోట వైపు తీసుకెళ్లడంలో దీప్ సిద్దు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో దీప్ సిద్దూ హింసను ప్రేరేపించారనే ఆరోపణలతో పోలీసులు అతన్ని ఫిబ్రవరి 9న హర్యానాలో అదుపులోకి తీసుకున్నారు. దీనిపై శనివారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతోపాటు రూ.30 వేల చొప్పున ఇద్దరి జామీన్లను సమర్పించాలని ఆదేశించింది. అవసరమైనపుడు పోలీసుల దర్యాప్తులో పాల్గొనాలని కోర్టు పేర్కొంది. అయితే దీప్‌ తీహార్‌ జైలు నుంచి బయటకు రాకముందే పురావస్తు శాఖ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అతన్ని మళ్లీ అరెస్టు చేశారు.

చదవండి: రైతుల ఉద్యమంలో నిరసనకారులు పెరగడానికి కారణమేంటి? 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top