చెత్త‘శుద్ధి’ ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

చెత్త‘శుద్ధి’ ఎక్కడ?

May 2 2026 11:31 AM | Updated on May 2 2026 11:31 AM

రోడ్లపైనే చెత్త చెదారం డంపింగ్‌యార్డుకే తరలిస్తున్నాం

జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా

టన్నుల కొద్ది చెత్త సేకరిస్తున్నా.. నిర్వహణ కరువు

తడి, పొడి చెత్తను వేరు

చేయడంలో నిర్లక్ష్యం

విలీన గ్రామాల్లో పరిస్థితి

మరింత అధ్వానం

పేట డంపింగ్‌యార్డులో

షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన చెత్త

–8లో u

మక్తల్‌ పట్టణంలో డ్రెయినేజీలను శుభ్రం చేయ డం లేదు. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమల వ్యాప్తి పెరిగి ప్రజ లు రోగాల బారిన పడుతున్నారు. అధికారు లు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపైన చెత్తాచెదారం కుప్పలుగా ఉన్నా దాన్ని తొలగించే నాథుడే కరువయ్యా డు. అధికారులు చెత్త నిర్వహణ సక్రమంగా చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలి.

– కుర్వ వెంకటేష్‌, మక్తల్‌

మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటా సేకరిస్తున్న చెత్తను ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నాం. విధి నిర్వ హణలో కార్మికులుఎలాంటి నిర్లక్ష్యం చేయడం లేదు. డ్రెయినేజీలు శుభ్రం చేసిన చెత్తాచెదారాన్ని ఎత్తి వాహనాల్లో డంపింగ్‌యార్డుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా చిన్న చిన్ని పొరబాట్లు జరిగితే వెంటనే పరిష్కరిస్తాం.

– గోల్కొండ నరసయ్య,

ఇన్‌చార్జి కమిషనర్‌, మక్తల్‌

నారాయణపేట: జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో చూసిన చెత్త ‘శుద్ధి’పై అధికారుల అలసత్వం.. పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. మున్సిపల్‌ అధికారుల, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో డంపింగ్‌ యార్డుల వద్ద చెత్త పేరుకుపోయి దుర్గంధభరితంగా మారుతున్నాయి. డంపింగ్‌ యార్డుల సమీపంలో ఉండే పంట పొలాలకు చెత్త కొట్టుకుపోవడం, దుర్గంధంతో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. పట్టణాల్లోని వివిధ కాలనీల్లో సేకరించిన చెత్తను ఆటో డ్రైవర్లు కొన్నిసార్లు రోడ్డుపైనే ఎక్కడపడితే అక్కడ పడేస్తున్న దాఖలాలు ఉన్నాయి. మక్తల్‌, కోస్గి, మద్దూర్‌ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో వారానికి రెండుసార్లే చెత్త సేకరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డంప్‌యార్డులు ఉన్నా..

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధిలో చెత్తను వేసేందుకు డంప్‌యార్డులు ఉన్నా నిర్వహణ లోపం, నిధుల కొరతతో చెత్త శుద్ధి చేయడంలో అధికారులు ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి వేస్తున్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులు, విలీనమైన గ్రామాల నుంచి తెచ్చిన తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ కరవు

మున్సిపాలిటీలో చెత్తను రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో వేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని ప్రజలను హెచ్చరిస్తూ మున్సిపల్‌ అధికారులు ఫ్లెక్సీలు పెడుతున్నారు. కానీ చెత్త నిర్వహణపై మాత్రం కమిషనర్‌ ఎలాంటి సమీక్ష నిర్వహించడం లేదు. దీంతో చెత్తలో పందికొక్కులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పంచాయతీలో ఉన్నప్పుడు అన్ని సేవలు పొందిన విలీన గ్రామాల ప్రజలకు మున్సిపాలిటీగా మారడంతో కొత్తగా సమస్యలు వస్తున్నాయి. చెత్తతో రోగాలు వ్యాప్తి చెందుతాయని ఆందోళన చెందుతున్నారు.

షార్ట్‌సర్క్యూట్‌తో..

జిల్లా కేంద్రంలోని డంపింగ్‌యార్డు సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద గత నెల 21న షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా నిప్పురవ్వలు చెత్తపై పడడంతో మంటలు చెలరెగాయి. ఫైర్‌ ఇంజన్లు వచ్చి ఆర్పినా ఇంత వరకు చెత్త కుప్పల మంటలు పూర్తిగా ఆరలేదు. పొగలు వస్తూనే ఉన్నాయి. ఘటన జరిగిన రోజు అటువైపు వెళ్లిన మున్సిపల్‌ అధికారులు, పాలకులు మళ్లీ కన్నెత్తి చూడటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెత్తను కాలిపోవడంతో పొగ వ్యాప్తి పెరిగింది. దీంతో పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు.

రోడ్ల పక్కనే..

నారాయణపేట నుంచి పగిడిమారి పోయే రహదారిలో శ్మశాన వాటిక సమీపంలోని బ్రిడ్జి వద్ద రోడ్డు పక్కనే చెత్తను డంపు చేస్తుండడంతో పరిసరాలు దుర్గంధంగా మారాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి దాపురించింది. డంపింగ్‌యార్డులో చెలరేగిన మంటలను పూర్తి స్థాయిలో ఆర్పేందుకు చర్యలు చేపట్టి.. పట్టణంలో సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

మున్సిపాలిటీ మక్తల్‌ నారాయణపేట మద్దూర్‌ కోస్గి

నివాస గృహాలు 6950 8280 3,889 6,466

దుకాణాలు 630 1280 566 435

రోజు చెత్త సేకరణ 4.5 టన్నులు 20 టన్నులు 0.3 టన్నులు 3.5 టన్నులు

నెలకు చెత్త సేకరణ 130 టన్నులు 600 టన్నులు 9.5టన్నులు 105టన్నులు

ఆటోలు 8 14 01 06

ట్రాక్టర్లు 2 06 03 02

పారిశుద్ధ్య కార్మికులు 41 84 35 70

Advertisement
 
Advertisement
Advertisement